29-03-2025 06:58:31 PM
మిషన్ భగీరథతో ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందించిన ఘనత కేసీఆర్దీ..
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): ఎండలు తీవ్రతరం అవుతున్నాయని నియోజకవర్గంలోని రెండు మున్సిపాలిటీలలోని 60 వార్డులకు, 107 గ్రామాలకు ఎలాంటి నీటి సమస్య రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం మిషన్ భగీరథ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిందే నీళ్లు, నిధులు, నియామకాల కోసమని, తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రజలకు ఎలాంటి నీటి సమస్య ఉండకూడదని ఒకవైపు కాలేశ్వరం లాంటి మహత్తరమైన ప్రాజెక్టు కట్టి మరోవైపు మిషన్ కాకతీయతో తెలంగాణ రైతులకు నీళ్లు అందించిన ఘనత కెసిఆర్ దేనని, అలాగే తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో నిర్మించాలని మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీళ్లు అందించి ప్రజల దాహార్తిని తీర్చిన మహనీయుడని కెసిఆర్ అని అన్నారు.
60 ఏళ్ల పాలనలో నీళ్ల కోసం గోసపడ్డ తెలంగాణ ప్రజలకు కాలేశ్వరం కట్టి దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దారని, తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసి రైతును రాజు చేసిన ఘనత కూడా కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడు ప్రజలకు నీటి సమస్య రాలేదని, ఇప్పుడు కూడా అలా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని అన్నారు. నియోజకవర్గంలో ఏయే ప్రాంతాలలో నీటి సమస్య ఎక్కువ ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి వెంటనే సమస్య పరిష్కరించాలని అధికారులకు సూచించారు. నీటి ఎద్దడి ఉండే ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలన్నారు. ప్రతిరోజు నీటి సమస్యపై అధికారులు ఆరా తీస్తూ నీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని అందించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ సమావేశంలో మిషన్ భగీరథ డీలు బాలరాజు, శ్రీనివాస్ తో పాటు ఏ.ఈ పాల్గొన్నారు.