25-02-2025 12:00:00 AM
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
బూర్గంపాడు, ఫిబ్రవరి 24: రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాల మెరుగుదల అనే కార్యక్రమం ద్వారా పిల్లలలో అభ్యసన సామర్ధ్యాల సాధన సులభతరం అవుతుందని, దీని ద్వారా పిల్లలు అభ్యసనంలో చేసే తప్పులను తెలుసుకోవటం, వాటిని సరిదిద్దటం సులభంగా సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన సామర్థ్యాల మెరుగుదల అనే కార్యక్రమాన్ని సోమవారం బూర్గంపాడు మండలంలోని అంజనాపురం,మోరంపల్లి బంజర్,బూర్గంపాడు,నాగినేని ప్రోలు రెడ్డిపాలెం, గాంధీనగర్ పాఠశాలల్లో, భద్రాచలం మండలంలోని ఎంపీపియస్ తాతాగుడి సెంటర్ పాఠశాలల్లో ఆయన ప్రారంభించారు.
అనంతరం ఆయా పాఠశాలల్లో తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లలకు ఇంటివద్ద చదువుకునే వాతావరణం కల్పిస్తే పిల్లలు అద్భుత ఫలితాలు సాధిస్తారని, అదేవిధంగా కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన సామర్ధ్యాల మెరుగుదల అనే కార్యక్రమం పిల్లలు నేర్చుకోవడంలో ఎంతో సహాయకారిగా ఉంటుందని ఈ కార్యక్రమాన్ని మన జిల్లాలో ప్రయోగాత్మకంగా ఆరు పాఠశాలల్లో ప్రారంభించడం జరిగిందని, దీనిని క్రమం తప్పకుండా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు వాడుతూ పిల్లలకు సామర్థ్యాలు పెంపొందించాలని సూచించారు.
దీనికై తల్లిదండ్రులు కూడా తమ సహాయ సహకారాలు అందిస్తూ పిల్లల్ని ప్రోత్సహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎం. వెంకటేశ్వర చారి, జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, బూర్గంపాడు మరియు భద్రాచలం మండలాల మండల విద్యాశాఖ అధికారులు యదు సింహరాజు, రమ, బూర్గంపాడు తహశీల్దార్ ముజాహిద్, ఎంపీడీవో జమలారెడ్డి ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.