calender_icon.png 7 October, 2024 | 7:13 PM

బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ విజయం

06-10-2024 12:00:00 AM

 టీ20 ప్రపంచకప్

షార్జా: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మాజీ చాంపియన్ ఇంగ్లండ్ బోణీ కొట్టింది. శనివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ వుమెన్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. ఇంగ్లిష్ బ్యాటర్లలో హడ్జ్ (41) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మయియా బౌచిర్ (23) పర్వాలేదనిపించింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో నహిద అక్తర్, ఖతూన్, మోని తలా రెండు వికెట్లు పడగొట్టారు. 119 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులకు పరిమితమైంది. బంగ్లా బ్యాటర్లలో మోస్త్రే 44 పరుగులు మినహా మిగతావారు రాణించడంలో విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ల లో స్మిత్, చార్లీ డీన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. హడ్జ్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది. 

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లిష్ జట్టు పవర్ ప్లే (0-6 ఓవర్లు) వికెట్ నష్టపోకుండా 47 పరుగులు చేసింది. ఇక ఇంగ్లండ్ భారీ స్కోరు చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ పవర్ ప్లే తర్వాత బంగ్లా బౌలర్లు విరుచుకుపడటంతో ఇంగ్లిష్ బ్యాటర్లు పరుగులు చేసేందుకు అపసోపాలు పడ్డారు. మొదటి ఆరు ఓవర్లలో 47 పరుగులు చేసిన ఇంగ్లండ్ తర్వాతి 14 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేయగలిగింది.