శ్రీలంకతో రెండో టెస్టు
లండన్: శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతోంది. 483 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక వర్షం అంతరాయంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. కరుణరత్నే, జయసూరియా క్రీజులో ఉన్నారు. అంతకముందు ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రూట్ రెండో ఇన్నింగ్స్‌లోనూ (103 పరుగులు) శతకం బాదడం విశేషం. లంక బౌలర్లలో కుమారా, ఫెర్నాండో చెరో 3 వికెట్లు పడగొట్టారు.
లంక విజయానికి 430 పరుగులు చేయాల్సి ఉండగా.. ఇంగ్లండ్ గెలుపుకు 8 వికెట్లు అవసరం. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉన్న నేపథ్యంలో ఇంగ్లండ్ విజయం ఖాయంగా కనిపిస్తోంది. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 427 పరుగుల భారీ స్కోరు చేయగా.. శ్రీలంక మాత్రం 196 పరుగులకే కుప్పకూలింది. తొలి టెస్టులో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1 ఆధిక్యంలో ఉంది.