calender_icon.png 31 March, 2025 | 6:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూ కబ్జాపై ఎండోమెంట్ మౌనం

29-03-2025 01:01:11 AM

  1. - 12 కోట్ల రూపాయల భూమి కబ్జాపై నోరు మెదపని అధికారులు 
  2. అధికారుల మౌనంపై ఎన్నో అనుమానాలు  
  3. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విజయక్రాంతి కథనం 

 రాజేంద్రనగర్, మార్చి 28 (విజయక్రాంతి): దేవాదాయ శాఖ భూములను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వాటిని పరిరక్షించాల్సిన అధికారులు అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ భూములను అప్పనంగా అక్రమార్కులకు అప్పగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

గండిపేట మండలం, మణికొండ మున్సిపల్ పరిధిలోని ఆల్కాపురి కాలనీలో రోడ్ నెంబర్ 16 లో సుమారు 12 కోట్ల విలువచేసే దేవాదాయ శాఖకు చెందిన భూమిని ఓ వ్యక్తి తప్పుడు పత్రాలు సృష్టించి దర్జాగా దానిని ఆక్రమించిన విషయం తెలిసిందే. రూ 12 కోట్ల దేవుడు భూమి స్వాహా! శీర్షికతో గురువారం విజయ క్రాంతి పత్రికలో సమగ్ర కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

ఈ కథనం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అవినీతికి పాల్పడుతూ అందిన కాడికి దోచుకొని అక్రమార్కులకు దేవుడి భూమిని కట్టబెట్టడంపై అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

- ఎండోమెంట్ అధికారుల తీరుపై అనుమానాలు ఎన్నో.. 

 దేవుడి భూములను రక్షించాల్సిన అధికారులు బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు క్షేత్రస్థాయిలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవాదాయ శాఖ భూములను పరిరక్షణలో చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆల్కపురి కాలనీలో తుల్జా రామ్ బాగ్ ఆలయానికి చెందిన 125, 116, 112 సర్వే నంబర్లో 800 గజాల భూమి ఉంది. దీనిని తప్పుడు సర్వే నెంబర్ తో ఓ వ్యక్తి కబ్జా చేశాడని కొన్ని రోజుల క్రితం ఎండోమెంట్ శాఖ అధికారులు సదరు స్థలం వద్దకు చేరుకున్నారు. ఎండోమెంట్ శాఖ ఈవో అరుణకుమారి, అదేవిధంగా ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, అదే విధంగా జిల్లా సూపరిండెంట్ మోహన్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకొని స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు.

ఆ తర్వాత ఏమైందో ఏమో పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికైనా ఎండోమెంట్ శాఖ అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి కోట్లు విలువ చేసే స్థలాన్ని స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.