02-04-2025 12:46:58 PM
భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని బుధవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఇ. శ్రీధర్ దంపతులు దర్శించుకున్నారు. దేవాలయం ప్రధాన ద్వారం వద్ద ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు దేవస్థానం అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. ప్రధాన దేవాలయంలోని సీతారామచంద్ర స్వామి వారిని కమిషనర్ శ్రీధర్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లక్ష్మీ తాయారు అమ్మ వారి ఆలయంలో భద్రాచలం దేవస్థానం ఈవో ఎల్ రమాదేవి వేద ఆశీర్వచనం నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
మంగళవారం భద్రాచలం వచ్చిన కమిషనర్ శ్రీధర్ మిథిలా స్టేడియంలో జరిగే సీతారాముల కళ్యాణం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ ఐటిడిఏ పీవో రాహుల్, ఎఎస్పి విక్రమ్ కుమార్ సింగ్ , ఆర్డిఓ దామోదర్, దేవస్థానం ఈవో ఎల్ రమాదేవితో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ఏడాది ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు, హైకోర్టు జడ్జిలు, శాసనసభ్యులు రాష్ట్ర స్థాయి అధికారులు వచ్చే అవకాశం ఉన్నందున అందరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.