- కుమారుడు మృతిచెందిన విషయం తెలియని దుస్థితి
- మూడు రోజుల పాటు తిండి లేక అవస్థలు
- జైపూరి కాలనీలోని విషాదం
ఎల్బీనగర్, అక్టోబర్ 28: అంధ తల్లిదండ్రుల్లో అంతులేని విషాదం నెలకొన్నది. కొడుకు మృతిచెందిన విషయం తెలియకపోవడంతో మృతదేహం వద్ద మూడు రోజు లుగా తిండి తిప్పలు లేకుండా ఉన్నారు. నాగోల్ సీఐ సూర్యానాయక్ కథనం ప్రకా రం.. నాగోల్ డివిజన్ జైపూరి కాలనీలోని బ్లుండ్ కాలనీకి చెందిన రమణ, శాంతకుమారి అనే వృద్ధ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.
పెద్ద కుమారుడు ప్రదీప్ భార్య, పిల్లలతో కలిసి వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. చిన్న కుమారుడు ప్రమోద్ వివాహం కాగా, వివాదాల కారణంగా భార్య వదిలిపెట్టింది. దీంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మద్యానికి బానిసయ్యాడు. కాగా, మద్యం మత్తులో మూడు రోజుల క్రితం ఇంట్లోనే మృతిచెందాడు.
అంధులైన తల్లిదండ్రులకు కొడుకు మృతిచెందిన విషయం తెలియక మృతదేహం వద్దే ఉన్నారు. తిండి లేక అల్లాడి పోయారు. అయితే, మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో స్థానికులు వచ్చి చూశారు.
సమాచారం తెలుసుకున్న నాగోల్ సీఐ సూర్యానాయక్, ఎస్సై శివనాగప్రసాద్ అక్కడకు చేరుకొని ఆకలితో అలమటిస్తున్న తల్లిదండ్రులకు తిండి పెట్టించారు. పెద్దకుమారుడు ప్రదీప్‌కు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. ప్రదీప్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ సూర్యానాయక్ తెలిపారు.