తొలి విమానం, చివరి విమానం ఆ రూట్‌లోనే..
న్యూఢిల్లీ: ప్రముఖ విమానయాన సంస్థ విస్తారా) కథ ముగిసింది. గడిచిన 10 ఏళ్లుగా సేవలందించిన విస్తారా బ్రాండ్ సోమవారంనుంచి కనుమరుగు కానుంది. టాటా గ్రూప్‌నకు చెందిన ఎయిరిండియాలో విలీనం అవుతుండడమే దీనికి కారణం. నవంబర్ 12 నుంచి ఈ విలీనం అమల్లోకి రానుంది. సోమవారం రాత్రి ఒక దేశీయ, ఒక అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రయాణంతో విస్తారా ప్రయాణం ఆగిపోనుంది.
విస్తారాకు చెందిన యూకే 986 విమానం ముంబయి నుంచి ఢిల్లీకి సోమవారం రాత్రి 10.50 గంటలకు బయల్దే రింది. దీంతోపాటు ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లాల్సిన యూకే 115 విమానం రాత్రి 11.45 గంటలకు బయల్దేరనుంది. ఇంకో ఆసక్తికర విషయమేమిటంటే.. 2015 జనవరి 9న ప్రారంభమైన విస్తారా తన తొలి విమానం సర్వీసు ఢిల్లీ- ముంబయి మధ్యే నడవడం గమనార్హం.
టాటా గ్రూపులో రెండో విలీనం
టాటా గ్రూప్ (51శాతం), సింగపూర్ ఎయిర్‌లైన్స్ (49శాతం) సంయుక్త సంస్థే విస్తారా. 2015లో దీని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఈ సంస్థ టాటా గ్రూపునకే చెందిన ఎయిరిండియా తో విలీనం కానుంది. అనంతరం సింగపూర్ ఎయిర్‌లైన్స్ సంస్థకు ఎయిరిండియా లో 25.1 శాతం వాటా ఉండబోతోంది. ఎయిరిండియాలో విస్తారా విలీనం తరవాత మరో రూ.3,195 కోట్లను సింగపూర్ ఎయిర్‌లైన్స్ పెట్టుబడిగా పెట్టనుంది.
ఇప్పటికే టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండి యా ఎక్స్‌ప్రెస్‌లో ఏఐఎక్స్ కనెక్ట్ అక్టోబర్‌లో విలీనం అయ్యింది. కొద్ది రోజుల వ్యవధిలోనే రెండో మరో విలీనం చోటుచేసుకోవడం గమనార్హం. గతంలో ఇండి యన్ ఎయిర్లైన్స్ సంస్థ ఎయిరిండియాతో విలీనం అయ్యింది. ఎయిర్ సహారా.. జెట్ ఎయిర్‌వేస్‌లో కలిసిపోయింది. ఎయిర్ డెక్కన్ కూడా కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో భాగమైంది.
అయితే ఈ విలీనంపై ఎయిరిండియాకు చెందిన కొంతమంది పైలట్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ పదవీ విరమణ వయస్సు 58 ఏళ్లు, విస్తారా పైలట్ల రిటైర్మెంట్ వయస్సు 60 ఏళ్లుగా ఉండడమ దీనికి కారణం. వెంటనే ఈ వ్యత్యాసాన్ని సరిచేయాలని వారు ఇప్పటికే టాటా గ్రూపును కోరారు.