సాగు చేసే భూములకే రైతు భరోసా...
ఎల్బీనగర్: సాగులో ఉన్న భూములకు మాత్రమే ప్రభుత్వం రైతు భరోసా ఇస్తున్నదని అధికారులు తెలిపారు. బీఎన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని సాహెబ్ నగర్ సీతా రామాంజనేయ కళ్యాణమండపంలో ప్రజా పాలనలో భాగంగా బుధవారం రైతు భరోసా సదస్సు నిర్వహించారు. సదస్సులో కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి, హయత్ నగర్ తహసీల్దార్ జానకి, అగ్రికల్చర్ ఆఫీసర్ సులేమాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... జనవరి 26వ తేదీ నుంచి అమలు చేస్తున్న రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిందన్నారు. సాగు చేసుకునే రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఉదాహరణకు రెండు ఎకరాల సాగు పొలం ఉండి, పరిస్థితులు బాగోలేక ఎకరం అమ్ముకొని ఇంకో ఎకరం సాగు చేసుకునే రైతులకు కూడా రైతు భరోసా పథకం లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ శ్వేత, రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నర్సింగ్ యాదవ్, రమేశ్, బీజేపీ డివిజన్ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి, బీజేవైఎం రంగారెడ్డి అర్బన్ జిల్లా సెక్రటరీ పవన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.