calender_icon.png 1 November, 2024 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన ప్రచారం

12-05-2024 01:16:03 AM

పోలింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు 

రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు 

ఎన్నికల విధుల్లో 72 వేల మంది పోలీసులు 

పోలింగ్ ముగిసే వరకూ రాష్ట్రంలో 144 సెక్షన్

ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ 

జూన్ 1 వరకు నో ఎగ్జిట్ పోల్స్

రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ 

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ఘట్టం శనివారం సాయంత్రంతో ముగిసింది. నెలరోజులుగా మోత మోగిన మైకులు ఒక్కసారిగా మౌనం దాల్చాయి.  పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నికకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ తెలిపారు. పోలింగ్ తేదీ ముగిసే వరకు రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా పెట్టినట్లు చెప్పారు. ఎన్నికల ప్రధాన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి  తనిఖీలు నిర్వహించగా 

 రూ.320 కోట్ల సొమ్మును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. 8 వేలకు పైగా కేసులు నమోదు చేశామని, అందులో డ్రగ్స్ సరఫరాకు సంబంధిచి 2 వేలకు పైగా ఉన్నట్లు వికాస్‌రాజ్ వెల్లడించారు. రాజకీయ పార్టీలపై 92 ఫిర్యాదులు వచ్చాయని, ఆయా ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు నోటీసులు ఇస్తున్నామన్నారు. కొన్నింటిపై ఈసీ చర్యలు తీసుకుంటుందన్నారు. పోలింగ్ విధుల కోసం దాదాపు 90 వేల మంది ఉద్యోగులు పాల్గొంటారని చెప్పారు. సీ విజిల్, టోల్ ఫ్రీ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకుంటున్నామని, ఫిర్యాదు అందిన వంద నిమిషాల్లోనే స్పందించాలని అధికారులను ఆదేశించినట్లు వెల్లడించారు. 

కట్టుదిట్టమైన భద్రత

బందోబస్తు నిమిత్తం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయన్నారు. రాష్ట్రానికి చెందిన 60 వేల మంది పోలీసులు ఎన్నికల విధుల్లో పాల్గొంటారని, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా కొంత మంది పోలీసులు వస్తారన్నారు. కేంద్ర బలగాలు కాకుండా మొత్తం 72 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని చెప్పారు. నలుగురు కంటే ఎక్కువగా కలిసి తిరగొద్దన్నారు. పోలింగ్ కోసం 87 వేలకు పైగా బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తున్నట్లు, దాదాపు 20 వేల యూనిట్ల బ్యాలెట్స్‌ను అదనంగా అందుబాటులో ఉంచుతామని చెప్పారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు 232 పోలింగ్ కేంద్రాలున్నాయన్నారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జీపీఎస్ ఉంటుందని, సీఈవో ఆఫీసు నుంచి మానిటరింగ్ ఉంటుందన్నారు. ఏజెన్సీ ఏరియాలో 328 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం.. 

రాష్ట్రంలో పార్లమెంట్, అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 గంటల వరకు నిషేధం ఉంటుందని వికాస్‌రాజ్  వెల్లడించారు. 13న ఎన్నికలు కావడంతో ఆ రోజు అన్ని కంపెనీలు, పరిశ్రమలు, సంస్థలు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆదేశించారు. నిబంధనలు పాటించపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రచారం ముగిసిన వెంటనే స్థానికేతరులు నియోజకవర్గాల్లో ఉండొద్దన్నారు.  12, 13 తేదీల్లో దినపత్రికలు, మీడియాలో ప్రకటనలు ఇవ్వాలంటే అనుమతి తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్‌సైట్లలో రాజకీయ ప్రకటనలు ఇవ్వకూడదని సూచించారు. 

పోస్టల్ బ్యాలెట్‌కు భారీగా.. 

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు రాష్ట్రంలో 1.88 లక్షల మంది పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారని సీఈవో తెలిపారు. 21,690 మంది హోం ఓటు వినియోగించుకున్నారని చెప్పారు. హోం ఓటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 93 శాతం మంది ఓట్లు వేశారని తెలిపారు. 96 శాతం ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తయిందన్నారు. మరింత సులభంగా ఓటు వివరాలు తెలుసుకునేందుకు కొత్త యాప్ తీసుకొచినట్లు చెప్పారు. ఈసీఐ స్పేస్ ఇచ్చి ఓటర్ నంబరుతో 1952 నెంబర్‌కు మెస్సేజ్ పెడితే ఓటర్ వివరాలు వస్తాయన్నారు.