calender_icon.png 23 February, 2025 | 2:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ముగింపు దిశగా..

18-02-2025 11:15:06 PM

సౌదీ అరేబియా వేదికగా రష్యా అమెరికన్ ప్రతినిధుల ద్వైపాక్షిక భేటీ..

రియాద్: ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం ఆగిపోతుందా? రెండు దేశాల మధ్య పెద్దన్న పాత్ర పోషించి శాంతి నెలకొల్పనుందా? ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే రెండు దేశాల్లో శాంతి నెలకొల్పేందుకు అమెరికా చొరవ తీసుకుంటుందనే సంకేతాలు వెలువెడుతున్నాయి. సౌదీ అరేబియాలో మంగళవారం అమెరికన్ రష్యన్ ప్రతినిధుల మధ్య చర్చలు ప్రారంభమవడమే అందుకు నిదర్శనం. తొలి విడత భేటీలో అమెరికా విదేశాంగశాఖ మంత్రి మార్కో రుబియో, రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గీ లవ్రోవ్, అమెరికా పశ్చిమాశియా రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, జాతీయ భద్రతా సలహాదారు మైక్‌వాల్ట్, సౌదీ అరేబియా మంత్రి ఫైజల్ బిన్ ఫర్హాన్ తదితరులు ప్రాతినిథ్యం వహించారు. భేటీలో అమెరికన్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ఈ భేటీ చర్చలకు అంకురార్పణ మాత్రమే కాదని, యుద్ధం ముగించేందుకు రష్యా సిద్ధంగా ఉందో లేదో తెలుసుకోవడానికని స్పష్టం చేశారు. రష్యన్ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ భేటీ రష్యాకు అమెరికాతో సత్సంబంధాలు నెరిపేందుకు ఉపయోగపడతుందని పేర్కొన్నారు.

జెలెన్‌స్కీతో చర్చలకు పుతిన్ ఓకే

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు పుతిన్ నిర్ణయాన్ని క్రెమ్లిన్ ధ్రువీకరిస్తూనే, మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడిగా జెలెన్‌స్కీ చట్టబద్ధతను ప్రశ్నించింది. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు మంగళవారం సౌదీఅరేబియా రాజధాని రియాద్‌లో చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ వేదిక ద్వారా రష్యా, అమెరికా ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత పుతిన్, జెలెన్‌స్కీతో విడివిడిగా సంభాషించారు. దీంతో ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకున్నది.

భేటీలో ఉక్రెయిన్ ప్రతినిధులకు మాత్రం చోటు దక్కలేదు. ఇలాంటి సందర్భంలో జెలెన్‌స్కీతో చర్చలకు సిద్ధమని పుతిన్ నుంచి ప్రకటన వెలువడడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. అయితే.. వీరిద్దరి శాంతి చర్చలు ఎప్పుడు.. ఎక్కడ? జరుగుతాయనే విషయంపై స్పష్టత లేదు. తాము ప్రాతినిథ్యం వహించని భేటీలో జరిగిన ఒప్పందాలను ఎప్పటికీ అంగీకరించమని  జెలెన్‌స్కీ ఇటీవల తేల్చిచెప్పడంతోనే పుతిన్ చర్చలకు సిద్ధమవుతున్నారని తెలిసింది.