calender_icon.png 28 October, 2024 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండో రోజే స్పెక్ట్రం వేలానికి ముగింపు

27-06-2024 02:00:37 AM

  • రూ.11,300 కోట్ల రేడియోవేవ్స్ విక్రయం

న్యూఢిల్లీ, జూన్ 26: రూ.96,238 కోట్ల విలువైన 10,500 మెగాహెర్జ్ స్పెక్ట్రం విక్రయానికి కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించిన వేలాన్ని టెలికాం కంపెనీల స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో రెండో రోజైన బుధవారం ఉదయం రూ.11.30 గంటలకే ముగించింది. ప్రభుత్వం విక్రయించతలపెట్టిన స్పెక్ట్రం విలువలో 12 శాతమే (రూ.11,300 కోట్లు) తాజా వేలంలో లభించింది. తొలిరోజున మొత్తం ఐదు రౌండ్లలో టెలికాం కంపెనీలు (టెల్కోలు) రూ. 11,000 కోట్ల విలువైన బిడ్స్ సమర్పించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. బుధవారం వేలం పునర్ ప్రారంభమవుతుందని టెలికాం శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. 800 మెగాహెర్జ్ నుంచి 26 గిగాహెర్జ్ బ్యాండ్స్‌లో స్పెక్ట్రం అమ్మకానికి పెట్టగా,  రూ.11,340 కోట్ల విలువైన స్పెక్ట్రంకు కంపెనీలు బిడ్స్ వేశాయని టెలికాం శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.

బిడ్డింగ్‌లో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పాలుపంచుకున్నట్టు తెలిపారు. తొలిరోజున ఐదు రౌండ్ల వేలం జరగ్గా, బుధవారం రెండు రౌండ్ల వేలాన్ని నిర్వహించారు. అయితే పెద్దగా స్పందన లభించకపోవడంతో 11.30 గంటలకు వేలం ముగిసినట్టు అధికారులు ప్రకటించారు.  స్పెక్ట్రం వేలానికి రిలయన్స్ జియో అత్యధికంగా రూ. 3,000 కోట్ల ముందస్తు డిపాజిట్ సమర్పించినట్టు సమాచారం. ఈ కారణంగా మూడు టెలికాం కంపెనీల్లో గరిష్ఠంగా రేడియోవేవ్స్‌కు బిడ్ చేసే అవకాశం ఈ కంపెనీకి లభిస్తుంది. భారతి ఎయిర్‌టెల్ రూ.1,050 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ.300 కోట్ల చొప్పున ఎర్నస్ట్ మనీ డిపాజిట్‌ను సమర్పించాయి. 

గత స్పెక్ట్రం వేలాన్ని 5 సర్వీసుల కోసం 2022 ఆగస్టులో  ఏడు రోజులపాటు నిర్వహించగా రూ.1.5 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రంను ఆయా కంపెనీలు కొనుగోలు చేశాయి. ఇందులో అత్యధికంగా ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ రూ.88,000 కోట్లకుపైగా విలువైన రేడియోవేవ్స్‌ను కొన్నది. సునీల్ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్‌టెల్ రూ. 43,000 కోట్ల స్పెక్ట్రంను కొన్నది. వొడాఫోన్ ఐడియా రూ.18,000 విలువైన స్పెక్ట్రంను సొంతం చేసుకున్నది.  

సగం స్పెక్ట్రం ఎయిర్‌టెల్‌దే

తాజా బిడ్డింగ్‌లో విక్రయమైన రూ.11,340 కోట్ల విలువైన 141.4 మెగాహెర్జ్ స్పెక్ట్రంలో సగం వేవ్స్‌ను భారతి ఎయిర్‌టెల్ కొనుగోలు చేసింది. ఈ కంపెనీ రూ. 6,856.76 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొన్నది. రిలయన్స్ జియో రూ.973.62 కోట్ల విలువైన రేడియోవేవ్స్‌ను కొనుగోలు చేయగా, వొడాఫోన్ ఐడియా రూ.3,510.4 కోట్ల విలువైన స్పెక్ట్రంకు బిడ్ చేసింది.