calender_icon.png 13 January, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామీణ వైద్య సేవలు అంతంతే!

04-08-2024 01:44:52 AM

నిర్దేశించిన నిధులు ఖర్చవ్వలె

వైద్యారోగ్యశాఖపై కాగ్  ఫైర్

హైదరాబాద్, ఆగస్టు 3 (విజయక్రాంతి): వైద్య సేవల కోసం ప్రభుత్వాలు చేస్తున్న ఖర్చు చాలాతక్కువగా ఉందని, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు సక్రమంగా అందటంలేదని కాగ్ నివేదిక ఎండగ ట్టింది. 3,206 ఆరోగ్య ఉప కేంద్రాలను పల్లెదవాఖానలుగా పేరు మార్చగా 122 పల్లె దవాఖానల్లో వైద్యులు లేరని తెలిపింది. జిల్లా దవాఖానలు, ఏరియా దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొన్ని చోట్ల ఓపీ సేవలు అందకపోయాయంది.

నిలోఫర్ ఆసుపత్రిలో సగటున ప్రతి నర్సుకు నాలుగు రెట్లు ఎక్కువ పడకలను కేటాయించారని వెల్లడించింది. నిర్దేశించిన మొత్తం కన్నా రాష్ర్టంలో వైద్యంపై తక్కువ మొత్తంలో ఖర్చు చేస్తున్నారని తెలిపింది. ప్రజలకు అవసరమైనన్ని పడకలు సైతం అందుబాటులో లేవని తేల్చింది. జాతీయ ఆరోగ్య విధానం ప్రకారం మొత్తం బడ్జెట్‌లో వైద్య రంగానికి 8 శాతం కేటాయింపులు ఉండాలని నిర్దేశించినా... రాష్ర్టంలో అది కేవలం సగం కూడా ఉండటం లేదని పేర్కొంది. 2025 నాటికి ఆరోగ్య రంగంపై వ్యయం రాష్ర్ట స్థూల ఉత్పత్తిలో 1.15 శాతం ఉండాల్సి ఉండగా అది 1 శాతం కంటే తక్కువే అని పేర్కొంది.  

‘సర్కారు’లో పడకల కొరత

2011 జనాభా లెక్కల ప్రకారం 35,004 పడకలు అవసరం ఉండగా ప్రభుత్వంలో కేవలం 27,996 పడకలే ఉన్నాయని కాగ్ తేల్చి చెప్పింది. 7,008 పడకల లోటు ఉందని తెలిపింది.