20-02-2025 12:27:28 AM
చెరువులు కాలువలో కుంటలు కబ్జాలను వెంటనే తొలగించాలి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, ఫిబ్రవరి 19 : (విజయ క్రాంతి): ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను గుర్తించి, తక్షణమే వాటిని తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ నగరంతో పాటు జిల్లాలో ప్రభుత్వ భూములు చెరువులు నాళాలు కాలువలు కబ్జాలకు గురైతున్న విషయమై విజయక్రాంతి వరుస వార్తా కథనాలు ప్రచురించింది.
సమాచారం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ స్పందిస్తూ కబ్జాలం తొలగించాలని ఆదేశించారు. నిజామాబాద్ నగరంలో మంగళవారం ఆయన పర్యటించారు. ఇటీవల కబ్జాలకు గురైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి కబ్జాలను తొలగించాలని ఆయన అధికారులను ఆదేశించారు. నగరంలోని నాగారం గుండారం తదితర ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటించారు.
చెరువులు కుంటలు కాలువలు వాగులు కబ్జాకురైతున్నాయి అన్న వార్తలు ఇటీవల విజయ క్రాంతి పత్రిక వరుస కథనాలు ప్రచురించింది. కబ్జా భూములు అక్రమ లేఅవుట్ల విషయమై బాధితులు సైతం జిల్లా కలెక్టర్ ను కలిసి తమ ఫిర్యాదులు చేశారు. నేపథ్యంలో కలెక్టర్ అన్యక్రాంతమవుతున్న ప్రభుత్వ భూములలో కబ్జాలను తొలగించాలని ఆయన ఆదేశించారు.
సమీకృత రెసిడెన్షియల్ విద్యా సంస్థలు, వసతి గృహ సముదాయాల నిర్మాణాల కోసం ఆయా ప్రదేశాలలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు గాను కలెక్టర్ మంగళవారం నిజామాబాద్ నగర శివారులోని నాగారం, గుండారం ప్రాంతాలను సందర్శించారు.
ఈ సందర్భంగా గుండారం గ్రామంలోని ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించిన సందర్భంగా పలు ఆక్రమణలు కలెక్టర్ గమనించారు. స్థానికులు ప్రభుత్వ భూముల కబ్జా విషయమై కలెక్టర్ దృష్టికి తెచ్చారు.
స్పందించిన కలెక్టర్..
వెంటనే ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించాలని, ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పై రెండు ప్రదేశాలలోనూ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, అనుకూల వాతావరణం తదితర అంశాలను కలెక్టర్ పరిశీలించారు.
ఎంత విస్తీర్ణంలో స్థలం అందుబాటులో ఉంది, రాకపోకలకు అనువుగా రోడ్డు మార్గం అందుబాటులో ఉందా అని పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాలలో నెలకొని ఉన్న పరిస్థితుల గురించి అధ్యయనం చేశారు. సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, తహసీల్దార్ బాలరాజు, సంబంధిత అధికారులు ఉన్నారు.