- మూసీ బాధితులకు ప్రత్యామ్నాయం చూపాలి
- హైడ్రాను ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది
- కూల్చివేతలపై హైకోర్టు మార్గదర్శకాలు
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): మూసీ నదీ గర్భం, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్‌లో చట్టవిరుద్ధంగా జరిగిన నిర్మాణాలను ఖాళీ చేయించాలని.. మూసీలోకి మురుగు నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మూసీ పునరుజ్జీవం వల్ల ప్రభావితమవుతున్నవారిని గుర్తించి సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని సూచించింది.
ఆక్రమణలో ఉన్న భూములు పట్టా లేదా శిఖం భూములు అయితే వాళ్లకు ముందుగా సమాచారం ఇవ్వాలని, చట్ట ప్రకారం పరిహారం కూడా చెల్లించాలని చెప్పింది. మూసీ పరీవాహకంలోని నివాసాలను ఖాళీ చేయించడం, కూల్చివేత చర్యలు అన్యాయమంటూ దాఖలైన 46 పిటిషన్లపై హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది.
ఒకే అంశానికి సంబంధించినవే పిటిషన్లు కావడంతో అవన్నీ పరిష్కారమైనట్టుగా ప్రకటించింది. మూసీ ప్రాంతంలో నివాసాల ఖాళీకి, ఆక్రమణల తొలగింపునకు కీలక మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మేరకు జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి తీర్పు వెలువరించారు.
హైడ్రా ఏర్పాటు చట్టబద్ధమే
చెరువుల రక్షణ నిమిత్తం ప్రభుత్వం జీవో 99 ద్వారా హైడ్రా ఏర్పాటు చేసిందని, అలా చేసే అధికారం రాష్ట్రానికి ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. తెలంగాణ ఇరిగేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం దానికి ప్రత్యేక అధికారిని నియమించిందని చెప్పింది. చట్ట ప్రకారం ప్రత్యేక అధికారాలను హైడ్రాకు ఇచ్చిందని గుర్తుచేసింది. చెరువుల్లో ఇళ్ల పట్టాలను కేటాయించినా వాటికి చట్టబద్ధత ఉండదని తేల్చిచెప్పింది.
ఇప్పటికే ప్రభుత్వం చట్టం రూపొందించిందని, దాని ఉద్దేశాలను ఈ కోర్టు పరిగణనలోకి తీసుకుంటుందని తెలిపింది. మూసీలో పర్యావరణ సమతౌల్యత పరిరక్షణ కోసం, భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వం విధివిధానాల్ని తెచ్చింది కాబట్టి భావితరాల కోసం మూసీ రక్షణ కోసం ఈ గైడ్‌లైన్స్ జారీ చేస్తున్నామని ప్రకటించింది.
మూసీ పరీవాహకంలోని లే అవుట్లలోని స్థలాల్లో జీహెచ్‌ఎంసీ అనుమతితో తాము నిర్మాణాలు చేశామని పిటిషనర్ల వాదించారు. మూసీ రక్షణ కోసం అక్రమణల తొలగింపుతోపాటు బాధితులకు ప్రత్యేక నివాసాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వం వాదించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు కీలకమైన పైతీర్పును వెలువరించింది.
నిజాం పాలనలో కీలక చట్టం
1908లో మూసీకి వరద పోటెత్తడంతో నాటి నిజాం పాలకులు జంట జలాశయాలను నిర్మించారని హైకోర్టు గుర్తుచేసింది. అప్పుడే ల్యాండ్ రెవెన్యూ యాక్ట్1317ను తెచ్చిందని, దీనిలో సెక్షన్ 24 పబ్లిక్ రోడ్లు, దారులు, బ్రిడ్జీలు, గుంతలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు వంటి వివరాలున్నాయని చెప్పింది. వీటిపై సర్వహక్కులు ప్రభుత్వానివేనని తెలిపింది.
ఆ తర్వాతే సర్వే చేశాక టిప్పన్, విలేజ్ నక్ష, ఒరిజినల్ సేత్వార్, వసూల్ బాక్వి, టౌన్ సర్వే ల్యాండ్ రిజిస్టర్, రికార్డ్ ఆఫ్ మెజర్మెంట్ రికార్డులు తయారయ్యాయని పేర్కొన్నది. సర్వే నంబర్లు. విస్తీర్ణం, బావులు, నదులు, ఇళ్లు, తదితర వివరాలను అధికారులు రికార్డు చేశారని చెప్పింది.
కొందరు చెరువులు, ట్యాంకులు, రివర్ బెడ్లను ప్లాట్లుగా మార్చి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేశారని, కొన్ని చోట్ల ప్రార్థనా మందిరాలు వెలిశాయని పేర్కొంది. ఇరిగేషన్ చట్టంలోని సెక్షన్ ప్రకారం ప్రభుత్వ సమ్మతితోనే నీటివనరులు, కాలువల నిర్వహణ ఉండాలని సూచించింది. ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం లేకపోవడంతో 2002లో అప్పటి ప్రభుత్వం వాల్టా చట్టాన్ని తెచ్చిందని గుర్తుచేసింది.
నీటివనరుల రక్షణకు మిషన్ కాకతీయ
నీటి వనరుల పరిరక్షణలో భాగంగా పూడికతీత, బండ్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకాన్ని చేపట్టిందని హైకోర్టు పేర్కొంది. ఇందులో భాగంగా ప్రభుత్వం 2012లో బిల్డింగ్ నిబంధనలు రూపొందించిందని చెప్పింది. ఇందుకు వీలుగా జీవో 168 జారీ చేసిందని తెలిపింది.
దీంతో ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టేందుకు వీల్లేదని పేర్కొన్నది. దేశంలోనే మొదటిసారిగా 48 వేల మేజర్, మైనర్ చెరువుల్లో పూడికతీతను దశలవారీగా చేపట్టాలని గత ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని.. ట్యాంకులు, చెరువుల భూములను నిషేధిత జాబితాలో చేరుస్తూ సీసీఎల్‌ఎ ఉత్తర్వులు కూడా ఇచ్చిందని గుర్తుచేశారు.
నోటీసులు ఇచ్చి చర్యలు చేపట్టాలి
పట్టా, శిఖం భూములు ఉన్నట్టయితే, వారికి నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం తగిన పరిహారం చెల్లించి సేకరించాలని ఆదేశించింది. నదులు, సరస్సులు, చెరువులను ఆక్రమించుకున్న భూకబ్జాదారులపై తెలంగాణ ఇరిగేషన్ యాక్ట్ 1357, వాల్టా చట్టం కింద క్రిమినల్ చర్యలు చేపట్టాలని సూచించింది.
మూసీ బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్, రివర్ బెచ్ జోన్లలోని చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసుకున్న నివాసాలను తక్షణం ఖాళీ చేయించడానికి చర్యలు తీసుకోవాలన్నది. సర్వే అధికారులు, సిబ్బంది వస్తే పిటిషనర్లు, ప్రజలు అడ్డుకోరాదని చెప్పింది. హైకోర్టు ఉత్తర్వుల అమలు కోసం నీటిపారుదల, రెవెన్యూ, హైడ్రా, మున్సిపల్ శాఖలకు పోలీసులు భద్రతను కల్పించాలని కోరింది.
మూసీ పునరుజ్జీవం వల్ల ప్రభావితులయ్యే వ్యక్తులకు సంబంధించి ఆర్థిక, సామాజిక సర్వే నిర్వహించాలని చెప్పింది. వారికి అనువైన ప్రాంతంలో వసతి కల్పించాలని ఆదేశించింది. 2012 బిల్డింగ్ రూల్స్ విధిగా అమలు చేయాలని స్పష్టంచేసింది. మూసీలో అక్రమ నిర్మాణాల తొలగింపుపై కింది కోర్టులు ఇంజక్షన్ ఆర్డర్స్ జారీ చేసేముందు 2023లో హైకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్ అమలు చేయాలపి ఆదేశించింది.