11-12-2024 12:45:37 AM
చేవెళ్ల, డిసెంబర్ 10: ప్రభుత్వ భూమి కబ్జా చెర వీడింది. చేవెళ్ల తహసీల్దార్ ఆదేశాలతో రెవెన్యూ అధికారులు 15 గుంటలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. చేవెళ్ల మండలం గుండాల గ్రామంలోని సర్వే నెంబర్ 153లో 1.01 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భాగం పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు.
మిగిలిన భూమి ఖాళీగా ఉండగా.. పక్కనే సర్వే నెంబర్ 154 పట్టాదార్లు దాన్ శ్రీనివాస్ కుమార్, రాజా తాడిచెర్ల ఇతరులు ఆభూమిని ఆక్రమించారు. ఈ విషయమై గ్రామానికి చెందిన మోహన్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన ల్యాండ్ ప్రొటెక్షన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సర్వేచేసి వారం రోజుల్లో చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, తహసీల్దార్‌కు నవంబర్ 25న ఆదేశాలు జారీచేశారు.
ఆపై రిపోర్ట్ తనకు సమర్పించాలని సూచించారు. దీంతో ఇటీవల సర్వేయర్ సర్వే చేయగా 15 గుంటలు ఆక్రమించినట్లు తేలింది. ఆయన తహసీల్దార్‌కు రిపోర్ట్ ఇవ్వగా ఆయన ఆదేశాల మేరకు మంగళవారం ఆర్‌ఐ, సర్వేయర్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్లి ప్రభుత్వ భూమిలో నిర్మించిన ప్రీకాస్ట్‌వాల్‌ను జేసీబీతో తొలగించి.. స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.