27-03-2025 05:29:24 PM
డిడిఎస్, కేవీకే ఆధ్వర్యంలో ఎస్సీ రైతులకు శిక్షణ, వ్యవసాయ సామగ్రి పంపిణీ..
సంగారెడ్డి (విజయక్రాంతి): ప్రకృతి, సేంద్రియ వ్యవసాయంను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని సంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లాలను జహీరాబాద్ కృషి విజ్ఞాన్ కేంద్రం, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రైతులకు చిరుధాన్యాల సాగుపై అవగాహన కల్పించారు. రైతులకు శిక్షణ, వ్యవసాయ సామగ్రి పంపిణీ చేశారు. గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (గ్లోబల్ సీవోఈ), ఐసిఏఆర్- ఐఐఎం ఆర్ ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ కులాల ఉపప్రణాళికలో నిర్వహించారు.
జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ వ్యవసాయ పద్ధతుల ప్రాధాన్యతను వివరించారు. జిల్లా వ్యవసాయ శాఖల మద్దతుతో అధిక దిగుబడి కలిగిన విత్తనాల వినియోగం, శాస్త్రీయ వ్యవసాయ విధానాల అనుసరణ ద్వారా రైతులు మరింత లాభదాయకంగా వ్యవసాయం చేయగలరని సూచించారు. సంగారెడ్డి జిల్లాలో కృష్టి విజ్ఞాన్ కేంద్రం DDS KVK ద్వారా రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పిస్తున్న విధానాన్ని ప్రశంసించారు. ఈ శిక్షణ కార్యక్రమాల ద్వారా రైతులు సేంద్రియ వ్యవసాయ విధానాలను అవలంబించి, నేల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, తెగుళ్ల నియంత్రణతో పాటు వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకునే అవకాశాన్ని పొందాలన్నారు.
దీని ద్వారా రైతులు తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయాన్ని పొందటమే కాకుండా, భవిష్యత్ లో స్వయం సమృద్ధి సాధించేందుకు కృషి చేయాలన్నారు. జహీరాబాద్ ప్రాంతంలో పప్పుధాన్యాలు (కంది, శనగ), నూనె గింజల (కుసుమలు) సాగుపై రైతులకు మెరుగైన అవగాహన కల్పించడానికి KVK, డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ (DDS) చేస్తున్న కృషిని ప్రశంసించారు. జహీరాబాద్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ భిక్షపతి మాట్లాడుతూ, ఈ పంపిణీ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం రైతులను మెరుగైన సాగు పద్ధతులతో పరిచయం చేయడం, నూతన సాంకేతికతల ద్వారా వ్యవసాయ వ్యవస్థను మరింత స్థిరంగా మార్చడం అని తెలిపారు.
KVK ద్వారా రైతులకు అవసరమైన శిక్షణ, మార్గదర్శకత, ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు ద్వారా శాస్త్రీయ సాగును ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక అధికారి రామచారి మాట్లాడుతూ... షెడ్యూల్డ్ కులాల కోసం "రాజీవ్ యువ వికాస్" పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ పథకం కింద గేదెలు (2) లేదా ఇతర వ్యాపారాలను ప్రారంభించేందుకు 90% సబ్సిడీ. 10% బ్యాంకు రుణం అందించబడుతుందని వివరించారు. 70% యంత్రాలకు.. వ్యవసాయ పనిముట్లు, కిరాణా దుకాణాలకు మంజూరు చేస్తామ న్నారు. వ్యవసాయ బోర్లు , విద్యుత్ సౌకర్యం, మందు పిచికారీ పరికరాలు (Sprayers) వంటి వ్యవసాయ పరికరాలు అందుబాటులో ఉంటాయని, ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 5 చివరి తేదీ అన్నారు.
డీడీఎస్ కేవీకే ఎస్సీ రైతు ప్రతినిధి మొగులమ్మ మాట్లాడుతూ, గ్రామాల్లో మట్టి పరీక్షలు నిర్వహించబడినట్లు, ఎస్సీ మహిళలకు మేకలు, కోళ్లు, జొన్న, కంది, కుసుమ, నాణ్యమైన కూరగాయల నారు పంపిణీ ద్వారా సమీకృత సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఈ సహాయంతో రైతులు తమ ఆదాయాన్ని పెంచుకుంటూ, ఇతర మహిళా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. డీడీఎస్- కేవీకే సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ వర ప్రసాద్ మాట్లాడుతూ... గత సంవత్సరం కాలంలో SCSP పథకం ద్వారా KVK ప్రవేశపెట్టిన నూతన సాంకేతికతలు, నాణ్యమైన నారు పంపిణీ, అలాగే పశుసంవర్ధక శాఖ, గృహవిజ్ఞాన శాఖ, సస్యరక్షణ విభాగాల ద్వారా నిర్వహించిన శిక్షణా కార్యక్రమాల ద్వారా ఎస్సీ రైతులకు గణనీయమైన ప్రయోజనం కలిగిందని వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ తో కలిసి రైతులకు మరింత సహాయం అందించడానికి కృషి చేస్తామన్నారు.
అర్హులైన రైతులకు స్ప్ర్పేయర్లు, టార్పాలిన్లు, హర్మాటిక్ సంచులు, వేప పిండి, వేపనూనె, పంచగవ్య, దశపర్ణి కషాయం, కిచెన్ గార్డెన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో DDS-KVK శాస్త్రవేత్తలు శైలజా, రమేష్, డాక్టర్ స్నేహలత, హేమలత, డాక్టర్ సాయి ప్రియాంక, డాక్టర్ కైలాష్, ఇతర వ్యవసాయ అధికారులు, రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. రైతులకు వ్యవసాయ అనుకూల పథకాలపై అవగాహన కల్పిస్తూ, సేంద్రియ సాగులో మరింత ప్రోత్సాహం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.