23-04-2025 01:22:20 AM
మృతుడి తలపై రూ.3 లక్షల రివార్డు
హిడ్మా కోసం కొనసాగుతున్న కూంబింగ్
112 రోజుల్లో 125 మంది మావోయిస్టుల ఎన్‌కౌంటర్
చర్ల, ఏప్రిల్ 22: ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. మంగళవారం బీజాపూర్ జిల్లా ఉసూర్ అటవీప్రాంతంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పు లు జరిగాయి. థానా బేదారే ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందుకున్న దంతేవాడ రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కమలోచన్ కశ్యప్, బీజాపూర్ ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ భారీగా భద్రతా దళాలను మోహరింపజేశారు.
జవాన్లు సెర్చింగ్ ఆపరేషన్ చేస్తుండగా వారికి మావోయిస్టులు తారసపడి కాల్పులు జరిపారు. అప్రమత్తమైన జవాన్లు వెంటనే ఎదురుకాల్పులకు దిగా రు. ఇరువర్గాల మధ్య భీకర పోరు జరిగింది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు కాల్పులు జరుపుతూ దట్టమైన అటవీప్రాంతానికి పరారయ్యారు. కాల్పుల విరమణ అనంతరం జవాన్లు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఘట నా స్థలంలో మావోయిస్టు మృతదేహాన్ని గుర్తించారు.
మృతుడిని గుండిపురి ఆర్పీసీ మిలిషియా ప్లటూన్ కమాండర్ వెల్లా వాచమ్‌గా గుర్తించారు. మృతుడి తల పై రూ.3 లక్షల రివార్డు ఉందని, అతడికి అం బేలీ పేలుడు ఘటనతో ప్రమేయం ఉందని పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
అగ్రనేత హిడ్మానే టార్గెట్..
పోలీసులు మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాను టార్గెట్ చేసినట్టు ఆ రాష్ట్రంలో వార్తలు వినిపిస్తున్నాయి. భద్రతా దళా లు హిడ్మా కోసం ఉసూరు పోలీస్ స్టేష పరిధిలోని అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్ట ప్రాంతంలో అణువణువు గాలిస్తున్నాయి.
ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. బస్తర్ డివిజన్‌లో పోలీసులు నిర్వహిస్తున్న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ ఫలితంగా గడిచిన 112 రోజుల్లో 125 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సుందర్‌రాజ్ వెల్లడించారు.