calender_icon.png 17 November, 2024 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్

04-09-2024 12:57:47 AM

10 మంది మావోయిస్టుల హతం.. కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్

భారీగా ఆయుధాలు, ఇతర సామగ్రి స్వాధీనం

రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), సెప్టెంబర్ 3: ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని లావాపురెంగల్ వద్ద మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది నక్సలైట్లు మృతిచెందారు. పురెంగల్ అటవీ ప్రాంతంలో రిజర్వ్ గార్డులు, స్పెషల్ టాస్క్‌ఫోర్స్, బీఎస్‌ఎఫ్, ఇండో టిబెటిన్ బార్డర్ పోలీస్ విభాగాలు సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి.

ఈ నేపథ్యంలో మావోయిస్టులు కాల్పులు జరపగా భద్రతా బలగాలు తిప్పికొట్టాయి. ఎన్‌కౌంటర్ ముగిసిన తర్వాత మరలా భద్రతా దళాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ క్రమంలో దాడిలో మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీగా ఆయుధాలు, వస్తు సామగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న అధికారులు, సిబ్బంది మొత్తం సురక్షితంగా ఉన్నట్లు అధికారులు వెల్లడిం చారు.

ప్రస్తుతం ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం మందిమార్క అడవికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం లో ఈ ఏడాది జూలైలో ఇద్దరు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ జవాన్లపై మావోయిస్టులు ఐఈడీ బ్లాస్ట్ చేసి చంపేశారు. ఇదే ఘటనలో మరో నలుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్ ప్రాంతంలో ఉన్న మందిమార్క అడవి బీజాపూర్, సుక్మా, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉంది.