17-04-2025 01:59:56 AM
చర్ల, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్‌లో మరోమారు మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. చనిపోయిన ఇద్దరు మావోయిస్టులు కూడా అగ్రనేతలే కావడం గమనార్హం. మృతులు మావోయిస్టు కమాండర్, తూర్పు బస్తర్ డివిజన్ సభ్యుడు హల్దార్, ఏరియా కమిటీ సభ్యుడు రామేగా గుర్తించారు.
హల్దార్ తలపై రూ.8 లక్షల రివార్డు, రామే తలపై రూ. 5 లక్షల రివార్డు ఉన్నట్టు బస్తర్ రేంజ్ యాంటీ నక్సల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పీ సుందర్ రాజ్ వెల్లడించారు. కొండగావ్- నారాయణపూర్ జిల్లా సరిహద్దుకు ఆనుకుని ఉన్న కిలాం-బుర్గమ్ ప్రాంతంలో కాల్పులు జరగ్గా.. ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి ఒక ఏకే-47, ఇతర ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 2025లో ఇప్పటి వరకు 140 మంది మావోయిస్టులు మరణించగా.. అందులో కేవలం బస్తర్ డివిజన్‌లోనే 123 మంది నేలకొరగడం విశేషం.