ఆరుగురు మావోయిస్టులు మృతి.. మృతుల్లో ఇద్దరు మహిళలు
మణుగూరు ఏరియా కార్యదర్శి లచ్చన్న మరణం
భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): కొన్నేండ్లుగా ప్రశాంతగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం తుపాకుల మోత మోగింది. కరకగూడెం గుండాల ఏజెన్సీ ప్రాం తంలోని మోతె గ్రామంలో తెల్లవారుజామున జరిగిన పోలీసుల కాల్పుల్లో ఆరు గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒకరు తప్పించుకున్నారు. మృతుల్లో మావోయిస్టు కీలకనేత, మణుగూరు ఏరియా కార్యదర్శి లచ్చన్న అలియాస్ వీరయ్య పాటు తులసీ, దుర్గేశ్, కోసి, శుక్రుడు, రాము ఉన్నారు.
వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఈ ఆరుగురిపైన భారీగా రివార్డులున్నాయి. ఘటనా స్థలంలో పోలీసులు 2 ఏకే 47 రైఫిల్స్, ఒక ఎస్‌ఎల్‌ఆర్, ఓ 303 రైఫిల్, పిస్టల్ తో పాటు లైవ్ రౌండ్లు, కిట్ బ్యాగ్‌లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మావోల సంచారంపై పక్కా సమాచారం అందుకున్న గ్రేహౌండ్ పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఘటనలో ఇద్దరు పోలీసులకు తీవ్రగాయాలు కావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి, ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. తప్పించుకొన్న మావోయిస్టు మాసయ్య కోసం పోలీసులు కరకగూడెం, గుండాల అడవులను జల్లెడ పడుతున్నారు.
పట్టు కోసం ప్రయత్నించి..
తెలంగాణ రాష్ట్రంలో పట్టు సాధించాలనే లక్ష్యంతో భద్రాద్రి కొత్తగూడెం అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి లచ్చన్న దళం కొంతకాలంగా భద్రాద్రి, ములుగు జిల్లాల్లో సంచరిస్తోంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన లచ్చన్న దళం ఆచూకీ కోసం పోలీసులు నెలరోజులుగా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. దళం ఆచూకీ తెలుసుకున్న పోలీసులు.. వర్షాలు, వరదల నేపథ్యంలో అడవిలో చిక్కిన మావోయిస్టులకు దండకారణ్యానికి తిరిగి వెళ్లేందుకు మార్గం లేకపోవడంతో ప్లాన్ ప్రకారం గురువారం తెల్లవారుజామున దాడి చేశారు.
వరుస ఎన్‌కౌంటర్లతో దద్దరిల్లుతున్న అరణ్యాలు
కొంతకాలంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దుల్లో వరుస ఎన్‌కౌంటర్లతో అరణ్యాలు దద్దరిల్లుతున్నాయి. బుధవారం ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ జిల్లాల సరిహద్దు భైరాంగఢ్ పీఎస్ పరిధిలోని అటవీప్రాంతంలో జరిగిన ఎదరు కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగన్ మృతిచెందారు. ఆ ఘటనను మరువక ముందే గురువారం తెల్లవారుజామున కరకగూడెం అడవుల్లో తుపాలకు మోత మోగింది. వరుసకాల్పుల్లో అగ్రనాయకుడు జగన్, కీలకనేత లచ్చన్న మృతి చెందడంతో మావోయిస్టులకు గట్టి దెబ్బ తగిలింది.
ఎన్‌కౌంటర్ విప్లవద్రోహుల పనే
కరకగూడెం మండలం మోతెలో జరిగిన ఎన్‌కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని భద్రాద్రి కొత్తగూడెం సీతారామరాజు డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేర్కొ న్నారు. ఈ మేరకు గురువారం లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ఈ హత్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఇలాంటి వాటికి మావోయిస్ట్ పార్టీ భయపడదన్నారు. రఘునాథపాలెం ఎన్‌కౌంటర్‌కు నిరసనగా ఈనెల 9వ తేదీన జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు.
ఆత్మరక్షణకై కాల్పులు
కరకగూడెం పోలీస్‌స్టేసన్‌కు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మోతె గ్రామంలో పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఆయుధాలను కలిగి ఉన్న మావోయిస్టులు తమపై కాల్పులకు పాల్పడ్డారని, ఆత్మరక్షణకై ఎదురు కాల్పులు జరిపినట్లు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్‌రాజు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారని వెల్లడించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాల్పుల్లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లకు గాయాలు కాగానే భద్రాచలం హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
రోహిత్‌రాజు,
భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ