28-04-2025 02:27:11 AM
హైదరాబాద్, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కాళేశ్వరం ఈఎన్సీ భూక్యా హరిరామ్‌ను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆదివారం తెల్లవారుజామున ఏసీబీ అధికారులు అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపించారు. సుమారు రూ.200 కోట్లకు పైగా అక్రమ ఆస్తులను గుర్తించిన ఏసీబీ.. ఈ కేసును మరింత క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది.
శనివారం తెల్లవారుజాము నుంచి టోలిచౌకిలోని హరిరామ్ లగ్జరీ విల్లాతో పాటు నివాసంలో 8 బృందాలుగా ఏర్పడి సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. 24 గంటల పాటు నిర్విరామంగా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగగా.. ఆదివారం తెల్లవారు జామున 2 గంటలకు సోదాలు ముగించి తెల్లవారుజామున 3 గంటలకు హరిరామ్‌ను అరెస్ట్ చేసి న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు.
14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. అతడి నుంచి బీఎండబ్ల్యూ కారుతో సహా రెండు కార్లు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పలు ఆస్తుల పేపర్లు, బ్యాంకు డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ ప్రకటించింది.
ఆస్తుల విలువ మార్కెట్ విలువ కంటే పదిరెట్లు ఎక్కువగా ఉంటుందని ఏసీబీ అధికారులు తెలిపారు. కాగా ఆయన భార్య అనిత కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనే డిఫ్యూటీ ఈఎన్సీగా పనిచేసింది. ఇప్పుడు వాలంతరీ సంస్థ డీజీగా పనిచేస్తున్నారు.
ఏసీబీ గుర్తించిన ఆస్తులు
తెలంగాణతో పాటు ఏపీలోని అమరావతిలో కమర్షియల్ భవనం ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 20 గుంటలు, శ్రీనగర్‌లో రెండు ఇండిపెండెంట్ ఇండ్లను గుర్తించారు.
వీటితో పాటు ఆరు ఎకరాల మామిడి తోట, ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం, కుత్బులాల్లపూర్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్లను గుర్తించారు. కొండాపూర్, షేక్‌పేట, మాదాపూర్, కోకాపేట, సంజీవరెడ్డి నగర్‌లో భారీ భవనాలు ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. సిద్దిపేట జిల్లా, మిర్యాలగూడలో ఫామ్‌హౌస్‌లు, మామిడి తోటలు భవనాలు గుర్తించారు.