- జనసంద్రమైన గుడి చెరువు ప్రాంగణం
- వేములవాడ ప్రజా విజయోత్సవ సభ సక్సెస్
- కాంగ్రెస్ శ్రేణుల్లో నూతానోత్సాహం
కరీంనగర్/సిరిసిల్ల, నవంబర్ 20(విజయక్రాంతి): వేములవాడ గుడి చెరువు కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు, మహిళలతో జనసంద్రంగా మారింది. రేవంత్‌రెడ్డి ముఖ్య మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం వేములవాడలో పర్యటిం చారు. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం మధ్యాహ్నం వేములవాడ గుడి చెరువులో జ్యోతిప్రజ్వలన చేసి ప్రజాపాలన ప్రజావిజయోత్సవ సభను ప్రారంభించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, కొండా సురే ఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, దామోదర రాజనరసింహ, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
సీఎం ప్రసంగిస్తున్న సమయంలో ప్రజల నుంచి విశేష స్పందన కనిపించింది. వేములవాడ అభివృద్ధి కోసం చేపట్టిన పనుల గురించి చెప్తుం టే కరతాళ ధ్వనులతో హర్షం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వ పనితీరుపై రేవంత్‌రెడ్డి తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు సంధించడంతో ప్రాంగణం కేకలతో హోరెత్తింది. స్థానిక సంస్థ ల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో చప్పట్ల మోత మోగిం ది.
రుణమాఫీ, ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాలు వడ్డీ లేని రుణాలు, 500 రూపాయలకు వంటగ్యాస్ అందజేస్తున్న తీరును సీఎం వివరించినప్పుడు మహిళలు నుంచి స్పందన లభిం చింది. మధ్య మానేరు నిర్వాసితులకు 4 వేలకుపైగా ఇండ్లు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రకటించడంతో నిర్వాసితులు హర్షం వ్యక్తంచేశారు. జనం పోటెత్తడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
గుడి చెరువుతోపాటు వేములవాడ బైపాస్ రోడ్, దేవస్థానం ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కార్యక్రమం కొనసాగినంత సేపు పోలీసులు వాహనాలను దారిమళ్లించారు. సీఎం సభ విజయవంతం కావడం పట్ల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రజలకు పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.