మూడుసార్లు నిర్మాణంలో కూలిన బ్రిడ్జి
తొమ్మిదేండ్లుగా కొనసాగుతున్న పనులు
రాజన్న భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు
రాజన్న సిరిసిల్ల, మే12(విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందు లు కల్గకుండా వేములవాడలో చేపట్టిన వంతెన పనులు ఎక్కడ వేసిన గొంగడి అక్క డే అన్నట్టుగా మారింది. ట్రాఫిక్ జామ్ సమ స్య తొలగించడంతోపాటు అధ్యాత్మికత ఉట్టిపడేలా ప్రారంభించిన ఈ వంతెన పనులు తొమ్మిదేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. వేములవాడలో మూలవాగుపై రెండు వంతెనలు ప్రారంభించగా ఒకటి పూర్తయింది. రెండోది నిర్మాణ దశలోనే ఉంది. అధికారు ల అజమాయిషీ లేకపోవడం, గుత్తేదార్ల నిర్ల క్ష్యం కారణంగా నాసిరకం పనులతో నిర్మాణంలోనే మూడు సార్లు కూలిపోయింది. ప్రభుత్వం వంతెన నిర్మాణంపై దృష్టిసారించి వేములవాడలో ట్రాఫిక్ సమస్య తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.28 కోట్లతో రెండు వంతెనలు
రాజన్న ఆలయానికి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటక, ఏపీతోపాటు మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్శనానికి వస్తుంటారు. హైదరాబాద్, కరీంనగర్, కామారెడ్డి రూట్ల నుంచి ఆలయానికి చేరుకునేందుకు దశాబ్దాల క్రితం నిర్మించిన ఇరుకైన పాత వంతెన మాత్రమే ఉండటం తో నిత్యం ట్రాఫిక్ జామ్‌లతో భక్తులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పర్వదినాలతో పాటు సెలవులు, సోమవారాల్లో పెద్ద ఎత్తున భక్తు లు వస్తుండటంతో వంతెనపై వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడేది. 2015లో అప్పటి ప్రభుత్వం కొత్త వంతెనలు నిర్మించేందుకు నిర్ణయించింది.
కోర్‌నెట్ అంచనా నిధుల ద్వారా రూ.28 కోట్లు మంజూరు చేసింది. 2016 జూలైలో అప్పటి ఆర్‌అండ్‌బీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ వంతెన నిర్మాణం కోసం ఆర్భాటంగా, ఆడంబరంగా భూమిపూజ చేశారు. ఆలయాల పట్టణం కావడంతో ఇక్కడికి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా వంతెన లను నిర్మించేందుకు రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా వినూత్నంగా డిజైన్ రూపొందించా రు. కొత్త రకం ఇంజినీరింగ్ పనులు కావడంతో ఢిల్లీ నుంచి సాంకేతిక పరమైన అను మతులు పొందారు. పాత వంతెనకు ఇరువైపులా 12 మీటర్ల వెడల్పు, 190 మీటర్ల పొడ వుతో రెండు వంతెనల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు.
బోస్టన్ పద్దతిలో స్వాగత తోరణాలతో నిర్మించేందుకు రూ.12 కోట్లు కేటాయించారు. మిగతా డబ్బులను భూసేకరణ, సుందరీకరణ కోసం వినియో గించుకునేలా 2018లో వంతెన పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. పాత వంతెనకు ఇరువైపులా రాకపోకలు సాగించేలా రెండు వంతెనలు పాతవంతెనను నడక దారుల కోసం వినియోగించు కునేలా రూపొందించారు. ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా వంతెనలపై త్రిశులాలు, ఢమరుకాలతో డిజైన్ చేశారు. అప్పట్లో వంతెన ఊహా చిత్రాలను గత ప్రభుత్వంలోని నాయకులు చాలా వైరల్ చేశారు.
మూడుసార్లు కూలిన వంతెన
మూలవాగుపై నిర్మిస్తున్న కుడివైపు వంతెన నిర్మాణంలో మూడుసార్లు కూలిపోయింది. ఏటా వర్షాకాలంలో వంతెన కూలి పోవడం, కుంగిపోతుంది. నిర్మాణానికి అవసరమైన భూసేకరణ పూర్తి కాకపోవడం కూడా మరో సమస్యగా మారింది. దీంతో తొమ్మిది సంవత్సరాలుగా పనులు పూర్తి కావడం లేదు. రెండో వంతెన పనులు ప్రారంభించిన తర్వాత మొదటి సారి పిల్లర్ల దశలో బీమ్‌లు కుంగిపోవడంతో కూలిపోయింది. మరో రెండు సార్లు మూలవాగులో వరదతో ఇసుక కొట్టుకపోయి కుంగిపోయి సెంట్రింగ్ సామాను కొట్టుకపోయి కూలింది. వంతెన నిర్మాణానికి భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఐదు పిల్లర్ల వంతెనకు మధ్యలో రెండు మాత్రమే పూర్తి చేశారు.
అధికారుల్లో ముందు చూపు లేకపోవడం, భారీ వర్షాలు కురుసే సమయాల్లోనే పను లు సాగించడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వానకాలం రాగానే గుత్తేదారు పనులు చేసినట్టు కనిపించడం, ప్రవాహం రాగానే కూలిపోవడం సర్వసాధారణంగా మారింది. మూలవాగు వంతెన నిర్మాణాలపై గుత్తేదారులు అలసత్వం ప్రదర్శించ డంతో పనులు ఆలస్యమవుతున్నాయి. గుత్తేదారు సమయానికి పనిపూర్తి చేయడం లేదంటూ ఆర్‌అండ్‌బీ అధికారులు ఆయనను పనుల నుంచి తొలగించగా, సదరు గుత్తేదారు కోర్టును ఆశ్రయించి, భూసేకరణ చేయకపోవడంతోనే పనులు ఆలస్యమవుతున్నాయంటూ తిరిగి పనులు దక్కించు కున్నాడు.
తాజాగా మరోసారి గుత్తేదారుకు అధికారులు నోటీస్‌లు పంపించారు. నాలుగేండ్ల క్రితం 90 శాతం పూర్తున ఎడుమవైపు వంతెనపై మహా శివరాత్రి జాతర సందర్భంగా ప్రయాణానికి అనుమతిస్తున్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వంతెన నిర్మాణ గుత్తేదారు ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదంటూ, ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం అప్పట్లో సంచలనం రేపింది.
వంతెన పనులు పూర్తి చేయాలి
వేములవాడకు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వాహనాల్లో తరలివస్తుంటారు. మూలవాగుపై ఒకే వంతెన ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుంది. భక్తులతో పాటు స్థానికులు సైతం ఇబ్బందులు పడాల్సివస్తుంది. ప్రభుత్వం స్పందించి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.
బీ అనిల్, వేములవాడ
పనులు పూర్తి చేసేందుకు చర్యలు
వేములవాడ మూలవాగుపై చేపట్టిన వంతెన పనులపై ఉన్నతాధికారుల సూచనలతో ముందుకు సాగుతాం. త్వరితగతిన వంతెన నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు చేపడు తాం. భూసేకరణ పూర్తి కావాల్సి ఉంది. ఇప్పటికే గుత్తేదారుకు పనులు చేయాలని నోటీస్ అందించాం.
ఆర్ సతీశ్, ఆర్‌అండ్‌బీ ఏఈ, వేములవాడ