సినిమా ప్రతినిధి (విజయక్రాంతి): బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ షూటింగ్‌లో గాయపడ్డారు. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో ‘జీ 2’ సినిమా యాక్షన్ సన్నివేశాన్ని ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. సోమవారం ఈ షూటింగ్‌లో పాల్గొన్న ఇమ్రాన్ ప్రమాదవశాత్తూ గాయపడ్డారు. ఆయన కుడి దవడ కింది భాగంలో గాయమైంది. దీంతో చిత్రబృందం ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆయన పరిస్థితిని నిలకడగా ఉంది. ఈ విషయాన్ని ఇమ్రాన్ వ్యక్తిగత సిబ్బంది వెల్లడించారు. డూప్ లేకుండానే ఇమ్రాన్ యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడంతో ఇలా జరిగినట్టు సమాచారం. అడివి శేష్ కథానాయకుడిగా దర్శకుడు వినయ్‌కుమార్ సిరిగినీడి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రమే ‘జీ 2’. 2018లో వచ్చిన ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ స్పై థ్రిల్లర్‌లో ఇమ్రాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఈ చిత్రానికి కంటే ముందే ఇమ్రాన్ తెలుగులో ‘ఓజీ’లో ప్రతినాయకుడి పాత్రకు ఎంపికయ్యారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓజీ’ చిత్రమే ఇమ్రాన్ ఖరారు చేసిన తొలి టాలీవుడ్ సినిమా. ‘జీ 2’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.