02-04-2025 03:41:47 PM
వైరా తహశీల్దార్ కార్యాలయంలో దర్శనమిస్తున్న ఖాళీ కుండలు..
దాహార్తి తీసుకునేందుకు చుక్క నీరు కరువు..
వైరా,(విజయక్రాంతి): అంతా ఆరంభ సూరత్వం లాగానే ఉంది ఆ కార్యాలయం అధికారుల పరిస్థితి.. ప్రచార ఆర్భాటం తప్పా.. పనితీరులో నిబద్ధత కనిపించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వైరా తహశీల్దార్ కార్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం కార్యాలయానికి పలు పనుల మీద విచ్చేసే ప్రజల దాహార్తి తీర్చేందుకై చలివేంద్రమును వైరా తహశీల్దార్ శ్రీనివాస్ ఆర్భాటంగా ప్రారంభించారు. ఏర్పాటు విషయంలో ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు. చేపట్టిన పని ప్రశంసనీయమైనప్పటికీ కొనసాగింపు మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలింది. చలివేంద్రమని పెద్ద ఫ్లెక్సీని చూసి నీరు తాగేందుకు వెళ్లిన ప్రజలకు ఖాళీ కుండలే దర్శనమిస్తున్నాయి. కుండల్లో నీరు పోసే నాధుడే కరువయ్యారు. ఎండ తీవ్రత అధికమవుతున్న తరుణంలో దాహార్తి తీర్చుకునేందుకు కనీసం ఒక్క చుక్క నీరు లేకపోవడంతో ప్రజలు దాహార్తితో విలవిలలాడుతున్నారు. ఏప్రిల్ నెల ఇప్పుడే ప్రారంభమైంది. మే నెల చివరి వరకు భానుడి భగభగ కొనసాగుతుంది ఆదిలోనే హంసపాదులా చలివేంద్రం నిర్వహణ, వైరా రెవిన్యూ అధికారుల తీరుపై పలు సర్టిఫికెట్ల కొరకు కార్యాలయానికి వచ్చే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ పెదవి విరుస్తున్నారు. దాహార్తిని తీర్చేందుకు ప్రతిరోజు మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.