calender_icon.png 21 September, 2024 | 2:59 AM

ఖాకీలు లేని ఠాణాలో ఖాళీ మద్యం సీసాలు

21-09-2024 12:41:08 AM

  1. డంప్ యార్డుగా మారిన రక్షకభట నిలయం
  2. సిబ్బంది లేక వెలవెలబోతున్న మాసాయిపేట పోలీస్ స్టేషన్

వెల్దుర్తి, సెప్టెంబర్ 20: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ స్టేషన్‌లో సిబ్బందికి బదులు ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. ఖాకీలు లేని ఠాణాలో ఖాళీ మద్యం సీసాలు పడి ఉన్నాయి. ఇది ఎక్కడో కాదు మెదక్ జిల్లా 44వ జాతీయ రహదారిపై ఉన్న మాసాయిపేట మండల కేంద్రంలోని పరిస్థితి. ఉమ్మడి వెల్దుర్తి మండలంలో మాసాయిపేట గ్రామ పంచాయతీగా కొనసాగేది. అయితే, ఈ ప్రాంత ప్రజల విజ్ఞప్తి మేరకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాసాయి పేటను మండల కేంద్రంగా మార్చింది.

ఈ మండలంలో 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. కొత్త మండలం కావడంతో అక్కడ తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 21 మండలాలు ఉండగా 20 మండలాల్లో పోలీస్ స్టేషన్లు, ఎస్‌హెచ్‌వో, సిబ్బందిని ఏర్పాటు చేశారు. కానీ కొత్త మండలంగా ఆవిర్భవించిన మాసాయిపేటలో పాత పంచాయతీ భవనంలో పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి బోర్డును ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్, సిబ్బందిని మంజూరు చేయకపోవడంతో ఖాకీలు లేని ఠాణాగా మారిపోయింది. ప్రస్తుతం ఈ మండలం చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. వారానికి ఒకసారి ఇద్దరు కానిస్టేబుళ్లు వచ్చి వెళ్తుంటారని గ్రామస్థులు తెలిపారు. 

డంప్ యార్డుగా మారిన స్టేషన్..

పోలీస్ స్టేషన్ అంటే శుభ్రతకు, క్రమశిక్షణకు నిలయంగా ఉండాలని పోలీసు ఉన్న తాధికారులు చెబుతున్నప్పటికీ మాసాయిపేట పోలీస్ స్టేషన్ మాత్రం చెత్తాచెదారం, ఖాళీ మద్యం సీసాలకు నిలయంగా మారిపోయింది. పోలీస్ స్టేషన్ ప్రాంగణాన్ని పంచాయతీ సిబ్బంది చెత్త డంప్‌గా మార్చివేశారు.  

నియామక ఉత్తర్వులు రాలేదు

మాసాయిపేట పోలీస్ స్టేషన్ మంజూరైనప్పటికీ ఎస్‌హెచ్‌వో, సిబ్బంది నియామకానికి ఉత్తర్వులు జారీ కాలేదు. త్వరలోనే సిబ్బంది నియామకం జరుగుతుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ఖాళీ మద్యం సీసాలు, చెత్తాచెదారం విషయం నా దృష్టికి రాలేదు. వెంటనే చర్యలు తీసుకుంటాం. 

 ఉదయ్‌కుమార్ రెడ్డి, మెదక్ జిల్లా ఎస్పీ