19-04-2025 12:41:50 AM
షాద్ నగర్, ఏప్రిల్ 18: దున్నేవాడిదే భూమి.. ఇది పాత మాట.. ఇప్పుడు ఆక్రమించుకునే వాడిదే భూమి.. ఎక్కడైనా చిన్న వి వాదం ఉందంటే అక్కడ అడుగు పెడతారు.. ఆక్రమణలు మొదలు పెడతారు. దీనికి కావలసిన పత్రాలను సదా మీ సేవలో.. అంటూ అందించేందుకు అధికారులు సిద్ధంగా ఉంటారు. దానికి తగిన ఆమ్యామ్యాలు ఇష్టారాజ్యంగా అందుకుంటారు. ఫలితంగా భూ వివాదాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయి.
నాదంటే నాదంటూ ఇరువర్గాలు పత్రాలు చూపిస్తుండడంతో ఎవరు ఆక్రమించారు, ఎవరు అసలు యజమాని అన్న విషయాలు తెలుసుకోవడం కోర్టుకు కూడా సాధ్యపడని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం అధికారుల విచ్చలవిడితనం. ఒక్కసారి కంసాన్పల్లి గ్రామంలోకి అడుగుపెడితే..
ఇది అసలు కథ..
ఫరూక్నగర్ మండలం కంసాన్పల్లి గ్రా మంలో పూర్వకాలం నుంచి భూములకు సంబంధించి మ్యాప్ లేదు. సర్వే నెంబర్ల విధానం సరిగ్గా లేదు. ఆ కాలం నుంచి కూడా గ్రామస్తులు తమకు తాము గానే హ ద్దులు చేసుకుని ఇది తమ భూమి అని నిర్ధారించుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు. అప్పట్లో దీనిని ఎవరు ప్రశ్నించలేదు.
కాలక్రమేనా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వృద్ధి చెందడంతో గ్రామీణ ప్రాంతాలలో కూడా ఈ వ్యాపారాలు ఊపందుకున్నాయి. కంసాన్పల్లి లాంటి చిన్న చిన్న గ్రామాలలో కూడా వెంచర్లు వెలిశాయి. భూముల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఆక్రమణదారుల కండ్లు గ్రామీణ ప్రాంతాల మీద పడ్డాయి. ఇక మ్యాప్ విధానం లేని కంసాన్పల్లి లాంటి గ్రామాలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ భూమి తమది అనే వివా దాలు తరచూ చోటు చేసుకుంటూనే ఉన్నా యి.
తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చిం ది. ఈ వివాదంలో ఇరువర్గాలు తమ పత్రాలను చూపుతూ ఇది తమ భూమి అని వాదిస్తుండడంతో ఏం చేయాలో అర్థం కాని అయోమయ పరిస్థితి నెలకొంది. దీనిపై పలుమార్లు వివాదాలు కూడా జరిగాయి. అయితే సమస్య ఎలా పరిష్కరించాలి అన్న ది ఎవరికీ అర్థం కాకుండా పోయింది. ఒక్కసారి ఈ వివాదానికి తెర తీస్తే..
ఇది ఆక్రమణ కథ..
గ్రామ శివారులలో సర్వేనెంబర్ 84 ఈ, 84 ఏ టు లతో పాటు పలు సర్వే నెంబర్లు కలుపుకొని ఓ వెంచర్ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సుమారు 800 మందికి ప్లాట్ల విక్ర యం కూడా జరిగింది. అయితే ఇందులో ప్రత్యేకించి పై రెండు సర్వే నెంబర్లలో ఉన్న 8 ఎకరాల భూమి విషయంలో వివాదం చో టు చేసుకుంది.
ఈ భూమి తనదేనని 2016లో ఆంజనేయులు, ఇతర రైతుల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నానని వెంచర్ యజమాని బసిరెడ్డి నరేందర్ రెడ్డి చెబుతున్నారు. ఆయన భార్య పద్మ పేరు మీద ఈ భూములు ఉన్నట్లు ఆయన వివరించారు. అయితే ఇదే సమయంలో ఈ భూమి తనది అంటూ విజయలక్ష్మి రవిశంకర్లకు చెందిన బంధువు కూడా ముందుకు రావడంతో అసలు వివాదం మొదలైంది.
ఈ భూమిని త మ అత్త 2008లోనే ఆమె కొనుగోలు చేసిందని ఆయన చెప్తున్నారు. ఇందుకు సంబంధించిన పత్రాలను ఆయన కూడా చూ పెంచారు. అయితే ఈ భూమిని స్వాధీ నం చేసుకునేందుకు వెళ్లే క్రమంలో ఇరు వర్గాల మధ్య వివాదం, పరస్పర దాడులు కూడా జరిగాయి.
ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్కు కూడా చేరింది. దాడులకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారాన్ని మాత్రం కోర్టు ద్వారా తెలుసుకోవాలని సూచించడంతో మళ్లీ కథ మొ దటికి వచ్చింది. ఇరువర్గాలు ప్రస్తుతం ఈ భూమి కోసం పోరాటాన్ని మొదలుపెట్టాయి. అయితే..
ఈ పాపం ఎవరిది..
ఈ భూమి కి నిజమైన యజమాని ఎవరన్నది తర్వాత ప్రశ్న. ఆయా పత్రాలను సుదీర్ఘంగా పరిశీలిస్తే నిజానిజాలు వెలుగులోకి రావచ్చు. ఇది కోర్టు పరిధిలోని వ్యవ హారం. కానీ అసలు ఒకే భూమి మీద రెండు పత్రాలు ఎలా బయటికి వచ్చాయి.. ఇద్దరికీ పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం ఎలా సాధ్యపడింది.. అన్నదే ప్రస్తుతం ముందున్న ప్రశ్న. దీనిని కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యంగా చెప్పవచ్చు.
అప్పట్లో పనిచేసిన అధి కారులు ఎవరో ఒకరికి తప్పుడు పత్రాలు ఇవ్వడం వల్లనే ఈ వివాదం చోటుచేసుకుంది. మ్యాప్ లేని ఈ గ్రామానికి ఒక మ్యా పు రూపొందించి సర్వే నెంబర్లను కేటాయించే పని కూడా అధికారులు చేయాలి. అది కూడా నిర్లక్ష్యం చేసిన అధికారులు ఒక భూమికి రెండు పత్రాలను జారీ చేసి అక్రమార్కుల అడుగులకు మడుగులు ఒత్తారు. ఇది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది.
దీనిపై ఉన్నతాధికారులు స్పందించి పత్రాలను పరిశీలించి ఏవి అసలు, ఏవి నకిలీ అన్న విషయాన్ని బయట పెడితే తప్ప ఈ వ్యవహారానికి ముగింపు ఉండదు. దీనిని ఇలాగే వదిలేస్తే మరిన్ని వివాదాలు తెరపైకి వస్తా యి. అక్రమార్కులకు ఇలాంటి అవకాశాలు కల్పించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మా దృష్టికి వస్తే పరిశీలిస్తాం...
ఫరూక్ నగర్ మండల పరిధిలోని కంసాన్ పల్లి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 84 ఈ, 84 ఏ లతో పాటు పలు సర్వే నెంబర్లను కలుపుకొని నిర్వహించిన వెంచర్ కు సంబంధించి వ్యవహారం తమ దృష్టికి రాలేదని, ఎవరైనా ఈ వ్యవహారంపై తమ వద్దకు వస్తే పరిశీలిస్తాం. గత అధికారుల కాలంలో జరిగిన వ్యవహారం అయినా కూడా పరిశీలించి చర్యలు తీసుకుంటాం.
పార్థసారథి, తహసిల్దార్, ఫరూక్ నగర్ మండలం.