calender_icon.png 23 November, 2024 | 5:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాధికారతతో బాలికలకు భరోసా

23-11-2024 12:00:00 AM

  1. జిల్లాలోని 146 ప్రభుత్వ పాఠశాలల్లో క్లబ్‌ల ఏర్పాటు 
  2. బాలికల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ముందుకు
  3. ప్రధానోపాధ్యాయుడి పర్యవేక్షణలో సభ్యుల నియామకం

మెదక్, నవంబర్ 22 (విజయక్రాంతి): బాలికల హక్కుల రక్షణలో భాగంగా ఇప్పటికే అనేక చట్టాలను రూపిందించిన ప్రభుత్వాలు.. పాఠశాల స్థాయిలో వారి హక్కులను కాపాడేందుకు  బాలికా సాధికారత క్లబ్‌ల ఏర్పాటు చేశాయి. గతేడాది ఎంపిక చేసిన క్లబ్‌ల కాల పరిమితి ముగియడంతో ఈ ఏడాడికి సంబంధించి కొత్తవాటి ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జిల్లాలోని 146 ప్రభుత్వ పాఠశాలల్లో ఈ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపడంతో కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలే కాకుండా కో-ఎడ్యుకేషన్ పాఠశాలల్లో సైతం ఈ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

చదువుతో పాటు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను క్లబ్‌ల ద్వారా విద్యార్థినులకు అవగాహన కల్పించనున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏళ్లుగా క్లబ్‌లను ఏర్పాటు చేస్తూ బాలికల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 

క్లబ్‌ల ఏర్పాటు ఇలా..

బాలికా సాధికారత క్లబ్‌లో చైర్మన్‌గా ప్రధానోపాధ్యాయుడు, కన్వీనర్‌గా మహిళా ఉపాధ్యాయురాలు, ఇద్దరు చురుగ్గా ఉండే బాలికలతో పాటు మరికొంతమంది బాలికలను స్థానిక షీటీం ఇన్‌చార్జితో కలిపి క్లబ్‌గా ఏర్పాటు చేస్తారు. 

అవగాహన కల్పించే అంశాలు..

గుడ్ టచ్..బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాల నియంత్రణ, మహిళలు, బాలికలపై హింస, ప్రేక్షకుల జోక్యం, లైఫ్ స్కిల్స్‌పై అవగాహన, ఆయా అంశాలపై జిల్లాస్థాయి కన్వర్జెన్స్ చైర్మన్ ఆధ్వర్యంలో లైన్ డిపార్టుమెంట్ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది.

విద్యార్థినులకు అవగాహన కల్పిస్తాం

జిల్లాలోని 146 ప్రభుత్వ పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్‌ల ఏర్పాటుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వ ఉత్తర్వులను ఆయా పాఠశాలలకు పంపించి కమిటీల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నాం. బాలికా సాధికారితపై శ్రద్ధ చూపడం, వారికి ఎలాంటి హాని కలగకుండా క్లబ్‌ల ద్వారా న్యాయం చేస్తాం. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ వంటి వాటి గురించి అవగాహన కల్పిస్తాం.   రాధాకిషన్, 

జిల్లా విద్యాశాఖ అధికారి, మెదక్