పండ్ల తోటల పెంపకానికి నిధులు
పాపన్నపేట, జూలై 15: ఉద్యాన పంటలను సాగుచేసే రైతులకు అధికారులు ఉపాధి హామీ పథకం నుంచి నిధులను మంజూరు చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే జిల్లాలో విస్తృత ప్రచారం క్షేత్రస్థాయిలో నిర్వహించారు. ఉద్యాన పంటలైన పండ్ల తోటలు పండించేందుకు ఆసక్తి ఉన్న రైతుల వివరాలను సేకరించి వారికి అవసరమైన నిధులను మంజూరు చేసేందుకు మండల స్థాయి నుంచి జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తున్నారు.
వెయ్యి ఎకరాల సాగు లక్ష్యంగా ముందుకు..
జిల్లాలో ఉద్యాన పంటలను పండించేందుకు గాను రైతులను సమాయత్తం చేసేందు కు ఉపాధి హామీ అధికారులు సిద్ధమయ్యారు. రాష్ట్ర రాజధానికి దగ్గరగా ఉన్న జిల్లా కావడంతో ఇక్కడ పండించే పండ్లను తక్కువ ఖర్చుతో రాజధానికి చేర్చి రైతులకు ఆదాయాన్ని సమకూర్చే అవకాశం ఉన్నదని అధి కారులు గుర్తించారు. ఇందుకు ఉపాధి హామీ నిధులను సమర్థవంతగా వినియోగించి రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించేందుకు ప్రణాళికలు రచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో కలిపి 1000 ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయడమే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పలు మండలాల్లో సుమారు 400 ఎకరాల్లో పండ్ల తోటల సాగుకు సంబంధించిన రైతుల వివరాలను, అందుకు అవసరమమ్యే నిధులకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
పండ్ల తోటల సాగుకు సాయం..
పండ్ల తోటలైన జామ, మామిడి, కొబ్బరి, డ్రాగన్ ఫ్రూట్, మునగ, సీతాఫలం, నిమ్మ, ఆపిల్ బేర్‌తో పాటు రైతులకు ఇష్టమైన పండ్ల తోటలను పెంచుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ తోటల సాగుకు రైతులను ప్రోత్సహించేందుకు అధికారులు ఉపాధి హామీ నుంచి నిధులను మంజూరు చేస్తారు. ఆసక్తి ఉన్న రైతులు మండల ఉపాధి హామీ కార్యాలయంలో ఉపాధి హామీ జాబ్ కార్డుతో పాటు ఆధార్‌కార్డు, పట్టా పాస్‌బుక్ ఇతర వివరాలను అందజేసి, సాగు చేసే తోట వివరాలను తెలియజేయాలి.
కార్యాలయ సిబ్బంది అందుకు తగ్గ ప్రతిపాదనలు సిద్ధం చేసి నిధుల మంజూరుకు జిల్లా కార్యాలయానికి పంపిస్తారు. అనుమతులు వచ్చిన తరువాత పంటలను గ్రౌండింగ్ చేసే అవకాశం ఉంటుంది. ఉపాధి హామీ నుంచి మొక్కల కొనుగోలు, గుంతలు తీయడం, మొక్కలు నాటడం వంటి పనులకు నిధులు మంజూరవుతాయి. మొక్కలు నాటిన తర్వాత తోట సంరక్షణకు రెండు సంవత్సరాల పాటు వాచర్ పేమేంట్ అందజేస్తారు. పండ్ల తోటల పెంపకానికి ముందుకు వచ్చే రైతులకు ఉద్యానవన శాఖ నుంచి 90 శాతం సబ్సిడీతో బిందు సేద్యం పరికరాలను అందజేస్తారు.
ఫాం పాండ్ నిర్మాణానికి అవకాశం
పండ్ల తోటల పెంపకంతో పాటు రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద ఫాంపాండ్‌ల నిర్మాణానికి సైతం అధికారులు నిధులు మంజూరు చేస్తున్నారు. వీటి ఏర్పాటు వల్ల నీటి లభ్యత పెరగడంతో పాటు భూగర్భ జలాలు పెంచేందుకు ఉపయోగపడుతుంది. వరదలకు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లో జరిగే నష్టాన్ని సైతం నివారించవచ్చు. వర్షాభావ పరిస్థితిలో నీటిని పంటకు ఉపయోగించవచ్చు. ఆరుతడి పంటలు వేసే రైతులకు నీటి సమస్య ఉండదు. రైతులు తమ పొలాల వద్ద నీటి ప్రవాహం వచ్చి చేరే చోట లేదా బోరు ఉన్న ప్రాంతానికి దగ్గరగా ఈ ఫాంపాండ్‌ను నిర్మించుకుంటే నీరు నిల్వ ఉండటంతో పాటు బోరుబావిలో నీరు అడుగంటకుండా ఉంటే అవకాశం ఉంటుంది.
రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఉద్యాన పంటలకు ఉపాధి నిధులను మంజూరు చేస్తున్నాం. రాజధానికి దగ్గర ఉన్న జిల్లా కావడంతో మార్కెట్‌లో పండ్లకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులు పండ్ల తోటల పెంపకానికి సిద్ధపడాలి. ఇందుకు గాను ఉపాధి హామీ ద్వారా కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి. ఫాంపాండ్‌లు నిర్మించేందుకు రైతులకు అవగాహన కల్పించాలని క్షేత్రస్థాయి అధికారులకు సూచించాం. ఆసక్తి గల రైతులు ఉపాధి హామీ కార్యాలయాల్లో సంప్రదించాలి.
శ్రీనివాసరావు, డీఆర్డీవో