calender_icon.png 1 March, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి

28-02-2025 07:24:42 PM

కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుద్యోగ యువతకు నైపుణ్యతపై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో కార్మిక, ఉపాధి కల్పన, గ్రామీణ అభివృద్ధి, వ్యవసాయ, పరిశ్రమలు, గిరిజన సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులు, సెర్ప్, మెప్మా అధికారులతో నిరుద్యోగ యువత-శిక్షణ-ఉపాధి కల్పన అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలోని నిరుద్యోగ యువతకు నైపుణ్యత పై శిక్షణ అందించి ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు.

ముఖ్యంగా నిరుద్యోగ యువతులకు జ్యూట్ బ్యాగుల తయారీ, ఎంబ్రాయిడరీ రంగాలలో శిక్షణ ఇవ్వాలని తెలిపారు. యువతకు భవన నిర్మాణ రంగం, పి. ఓ. బి., పెయింటింగ్, ఎలక్ట్రీషియన్, మార్బుల్స్, ప్లంబింగ్, ఫ్లోరింగ్ వంటి వాటిపై శిక్షణ అందించాలని తెలిపారు. యువత ప్రస్తుత సమాజంలో డిమాండ్ ఉన్న రంగాలను ఎంచుకొని శిక్షణ పొంది జీవితంలో స్థిరపడే అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలిపారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద యువతకు శిక్షణ అందించాలని, జిల్లాలో మరిన్ని జాబ్ మేళా కార్యక్రమాలు నిర్వహించి ఉపాధి అవకాశాలు కల్పించాలని తెలిపారు. వైద్యరంగంలో మహిళలకు నర్సింగ్, సహాయకుల ఉద్యోగాలకు డిమాండ్ ఉన్నందున ఆయా రంగాలలో శిక్షణ అందించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో  సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.