హైదరాబాద్ తర్వాత వరంగల్‌కే ప్రాధాన్యం
రాష్ట్రంలో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయాలి
ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హనుమకొండ, జూలై 4 (విజయక్రాంతి) : విదేశాల్లో స్థిరపడిన తెలంగాణ ప్రాంత వ్యక్తులు ముందుకొచ్చి ఇక్కడి నగరాల్లో వ్యాపార సంస్థలను ఏర్పాటు చేయాలని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండలో రంజిత్ రావుల ఏర్పాటు చేసిన రాక్స్ ఐటీ సొల్యూషన్ కంపెనీని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రంజిత్ ఆమెరికాలో వ్యాపారరీత్యా స్థిరపడినప్పటికీ తన సొంత జిల్లా సొంత ప్రాంతానికి మంచి చేయాలనే ఆలోచనతో సంస్థను ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు.
ప్రతి ఒక్కరూ హైదరాబాద్‌లోనే వ్యాపారం చేస్తూ అక్కడే స్థిరపడాలనే ఆలోచనతో ఉన్నారని, వరంగల్ నగరం కూడా చదువులకు కేంద్రంగా విజ్ఞానానికి నిలయంగా అనేక కళాశాలలకు పుట్టినిల్లుగా నిలిచిందని చెప్పారు. ఇక్కడ ఉన్న మానవ వనరులు ఆమెరికా లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోకుండా వారి ఇంటి వద్దనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడే ఆ తరహా రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి రెండో శ్రేణి నగరాల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
ఇక్కడ సంస్థలు ఏర్పాటు చేసే వారికి పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చా రు. ఇక్కడ విమానాశ్రయం నిర్మాణం పెండింగ్‌లో ఉందని ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. హనుమకొండ, వరంగల్ నగరాలను సాఫ్ట్‌వేర్ రంగానికి పరిమితం కాకుండా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్న పరిశ్రమలు ముఖ్యంగా టెక్స్‌టైల్ పరిశ్రమకు సంబంధించిన వాటికి కూడా త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి తెలిపినట్లు శ్రీధర్‌బాబు చెప్పారు.
రాబో యే రోజుల్లో హైదరాబాద్ తర్వాత వరంగల్‌కు ప్రాధాన్యమిస్తామని అభివృద్ధి పరం గా ముందు వరుసలో ఉంచుతామని పేర్కొన్నారు. ప్రభుత్వ పరంగా ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయడానికి టీజీపీఎస్పీ ద్వారా నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు. అలాగే ప్రైవేట్ రంగాల్లో కూడా ఉపాధి అవకాశా లు మెరుగుపరుస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, రాక్స్ ఐటీ పొల్యూషన్స్ స్థాపకులు రంజిత్ రావులు, శ్రీని వాసరావు తదితరులు పాల్గొన్నారు.