- లిడ్ క్యాప్ భూములను కాపాడుకోవాలి
- ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): మాదిగలు, మాదిగ ఉపకులాల్లోని నిరుద్యోగ యువతకు తోళ్ల పరిశ్రమలో శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. లిడ్ క్యాప్ భూములు ఆక్రమ ణకు గురికాకుండా కాపాడుకోవాలని ఆయన పేర్కొనారు.
సీఎం రేవంత్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాల మేరకు శనివారం తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సుకు ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌కుమార్ హాజరై మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం లిడ్ క్యాప్, తోలు పరిశ్రమను అభివృద్ధి చేయలేదని, వాటికి చెందిన భూములను ఆక్రమణలకు గురైనా పట్టించుకోలేదని విమర్శించారు.
ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోవాలన్నారు. మాదిగ, మాదిగ ఉప కులాలకు స్వయం ఉపాధి కల్పించే అంశంపై సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్‌బాబుకు నివేదిక ఇవ్వనున్నట్లు చెప్పారు. సదస్సులో కమిషనర్ అండ్ డైరెక్టర్ మల్సూర్, లిడ్ క్యాప్ ఎండీ శ్రీనివాస్ నాయక్, రాష్ట్ర చర్మకారుల జేఏసీ చైర్మన్ డాక్టర్ ఆరేపల్లి రాజేందర్, కన్వీనర్ కుసపాటి శ్రీనివాస్, జాయింట్ కన్వీనర్ దేవని సతీష్ మాదిగ, ప్రొఫెసర్ మురళీదర్శన్, జాన్ దర్శనం, మొలుగు రాజు పాల్గొన్నారు.