calender_icon.png 29 November, 2024 | 2:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి @ మెడికల్ డిజ్ పార్క్

29-11-2024 01:08:05 AM

  1. పటాన్‌చెరువుకు తలమానికంగా నిలుస్తున్న హబ్
  2. స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమలు
  3. మొగ్గుచూపుతున్న స్థానిక యువత, మహిళలు
  4. ఇప్పటికే 20-30 పరిశ్రమల ఏర్పాటు

పటాన్‌చెరు, నవంబర్ 28 : పటాన్‌చెరు నియోజకవర్గం అమీన్‌పూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ శివారులో తెలంగాణ ప్రభు త్వం ఏర్పాటు చేసిన మెడికల్ డివైజ్ పార్క్(ఎండీపీ) పటాన్‌చెరుతో పాటు రాష్ట్రానికే తలమానికంగా నిలుస్తోంది. ఎంతోమంది ఉపాధికి కల్పతరువులా మారింది.

మెడికల్ డివజ్ పార్కు ఏర్పాటుతో ప్రధానంగా అమీన్‌పూర్, జిన్నారం మండలాల పరిధిలోని యువతకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తున్నాయి. దూర ప్రాంతాలకు నానా యాతన పడుతూ వెళ్లి ఉద్యోగాలు చేసేవారికి సమీపంలోనే ఉద్యోగ అవకాశాలు లభిస్తుండటంతో మరింత మంది యువకులు..

పరిశ్రమల వద్దకు వెళ్లి ఉద్యోగాల కోసం రెజ్యూమ్‌లు అందజేస్తున్నారు. ప్రధానంగా మాదారం, కొడకంచి, మంత్రికుంట, జానకంపేట, కొర్లకుంట తదితర ప్రాంతాలకు చెందిన వందలాదిమంది నిత్యం ఇక్కడి పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. 

స్కిల్డ్, అన్‌స్కిల్డ్ ఉద్యోగాలు..

చదువును బట్టి పరిశ్రమల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. బీటెక్, బీఎస్సీ కెమిస్ట్రీ, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన విద్యార్థులు వారి చదువును బట్టి ఉద్యోగాలు చేస్తుండగా, చదువులేని వారు పరిశ్రమల్లో గార్డెనింగ్, హౌస్‌కీపింగ్ పనులతో ఉపాధి పొందుతున్నారు. గతంలో గచ్చిబౌలి వరకు మహిళలు ఆటోలలో ఈ గ్రామాల నుంచి ఉపాధి కోసం ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేవారు.

మెడికల్ డివైజ్ పార్కు ఏర్పడిన తరువాత సమీపంలోనే ఉపాధి లభిస్తుండటంతో వ్యయప్రయాసలు చాలా తగ్గాయి. ఇక్కడ ప్రస్తుతం సుమారు 20 పరిశ్రమల వరకు నడుస్తుండగా మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. ఇవి కూడా ఉత్పత్తులు ప్రారంభిస్తే మరింత మంది యువ తకు, స్థానికులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

మెడికల్ డివైజ్ పార్కుపై  అవగాహన కల్పించాలన్నారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల యువత కూడా మెడికల్ డివైజ్ పార్కులో ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు.

స్థానికంగానే పని దొరికింది

ఇంతుకుముందు గచ్చిబౌలికి ఆటోలో పనికి వెళ్లేటోల్లం. మబ్బుల లేచి వంట తయారు చేసుకొని ఉదయం వెళ్తే ఇంటికొచ్చే సరికి రాత్రి అయ్యేది. రోజు ఇదేపనిగా ఉండేది. చాలా ఇబ్బందులు పడుతూనే పనికి వెళ్లినం. సూల్తాన్‌పూర్ దగ్గర ఏర్పాటు చేసిన కంపెనీల్లో తాజాగా పనికి కుదిరాం. జీతాలు కూడా బాగానే ఇస్తున్నారు. మా ఊరుకు రెండు కిలోమీటర్ల దూరంలోనే పరిశ్రలు ఉన్నాయి. నడుచుకుంటూ పోతున్నం. మా ఊరు నుంచే 200 మంది ఆడోళ్లు పనికి పోతున్నరు.

 చించాల లత, మాదారం

సద్వినియోగం చేసుకోవాలి

మెడికల్ డివైజ్ పార్కులో చదువుకున్నవారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బీఎస్సీ కెమిస్ట్రీ, బీటెక్, బీఎస్సీ కంప్యూటర్స్ ఉన్నవారికి ఉద్యోగ ప్రాధన్యతలు ఉన్నాయి. ఎక్కడో దూరంగా వెళ్లి ఉద్యోగాలు చేయడం కంటే అందుబాటులో ఉన్న మెడికల్ డివైజ్ పార్కులోని పరిశ్రమల్లో ఉద్యోగాలు చేయడం వలన సమయం, శ్రమ రెండూ తగ్గుతాయి. పరిశ్రమలు కల్పిస్తున్న ఉద్యోగ అవకాశాలను స్థానిక యువకులు సద్వినియోగం చేసుకోవాలి.

 తెనుగు శేఖర్, మాదారం