calender_icon.png 10 January, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల ఆదాయం పెంచేలా ఉపాధిహామీ పనులు

02-11-2024 12:49:42 AM

  1. వచ్చే ఐదు నెలల్లో రూ.1,372 కోట్లతో ప్రణాళికలు
  2. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ధనసరి సీతక్క

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం పకడ్బందీగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేయించాలని, రైతుల ఆదాయం పెంచేలా ఉపాధిహమీ నిధులతో వ్యవసాయ అనుబంధ పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్,  గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, స్పెషల్ కమిషనర్ షఫిఉల్లా ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వచ్చే 5 నెలల కాలానికి సంబంధించి రూ.1,372 కోట్ల నిధులతో చేపట్టే పనుల ప్రణాళికలకు ఆమోదం తెలిపారు.

రూ.106 కోట్లతో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద ప్రతీ నియోజకవర్గానికి రూ.కోటి ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. 5,400 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆదాయాన్ని పెంచడంలో భాగంగా పశువుల కొట్టాలు, కోళ్ల షెడ్ల నిర్మాణం, వర్మికాంపోస్ట్ తదితర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.

ప్రతీ నియోజకవర్గానికి రూ.రెండు కోట్లు ఖర్చు చేసి వ్యవసాయ పొలాలకు బాటలు వేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. దీంతో పాటు 2,700 ఎకరాల్లో రూ.16.20 కోట్లతో చిన్న, సన్నకారు రైతులకు పండ్ల తోటలు, ఈత మొక్కల పెంపకం చేపట్టి ఆదాయాభివృద్ధిని పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

9 కోట్ల మొక్కలను వచ్చే ఏడాది వనమహోత్సవంలో నాటడానికి సిద్ధంగా ఉంచాలని తెలిపారు. జలనిధి కింద వర్షపు నీటిని ఒడిసి పట్టేందుకు రాష్ర్టంలో రూ.204 కోట్లతో ప్రతీ నియోజకవర్గానికి సుమారు రెండు కోట్ల నిధులతో మొత్తం 11,350 నీటి నిల్వ, నీటి సంరక్షణ పనులను చేపట్టడానికి ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు.

ప్రతీ నియోజకవర్గానికి సుమారు రూ. 5 కోట్ల నిధులతో గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించనున్నట్లు స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.4,960 కోట్ల నిధులతో చేపట్టే పనుల కోసం అధికారులు అంచనా ప్రణాళికలు సిద్ధం  చేయగా, అందుకు ఆమోదం తెలిపారు.