calender_icon.png 19 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ, పంచాయతీరాజ్ పనులు వేగవంతం చేయాలి

18-03-2025 08:21:30 PM

జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష..

సంగారెడ్డి కలెక్టర్ క్రాంతి వల్లూరు..

సంగారెడ్డి (విజయక్రాంతి): ఉపాధి హామీ, పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలలో చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అధికారులకు ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డిలో జిల్లాలో గ్రామీణాభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులతో మినీ సమావేశ మందిరంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ప్రారంభమైన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ నెల 24లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. ముఖ్యంగా గ్రామాలలో నిర్మాణంలో ఉన్న సీసీ రోడ్ల పనులను, గడువులోగా పూర్తిచేయాలని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన రహదారులు వేయించాలని అన్నారు.

గ్రామీణాభివృద్ధి పనులకు అవసరమైన సాంకేతిక అనుమతులను అధికారులు వెంటనే పొందాలని కలెక్టర్ సూచించారు. అనుమతుల ఆలస్యానికి పనులు నిలిచిపోకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల్లో మాస్టర్ లు, జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, అలాగే ఆ పనులకు సంబంధించిన ఫొటోలు సిద్ధం చేయాలని డీఆర్డిఏ అధికారులకు సూచించారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమం పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. పల్లెల్లో నడుస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, రోడ్ల నాణ్యతపై ఎటువంటి రాజీ ఉండకూడదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. గ్రామాలలో వేస్తున్న రోడ్లను పూర్తిస్థాయిలో గ్రౌండింగ్ చేయడం, మెటీరియల్ సమకూర్చడం, నిర్మాణ నాణ్యతను క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు, రోడ్ల నిర్మాణం సరిగ్గా జరుగుతున్నదని నిర్ధారించుకోవాలని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించిన పాఠశాల అభివృద్ధి పనులను అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలని సూచించారు.

పాఠశాలలకు అవసరమైన రోడ్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణాలను వేగంగా పూర్తిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. విద్యార్థులకు మరింత సురక్షితమైన వాతావరణం అందించేందుకు వీటిని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే ప్రారంభించిన పనులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయం పెంచుకుని, ప్రజలకు ఉపయోగపడేలా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. అభివృద్ధి పనులలో ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణీత గడువుల్లో పనులను పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఎ ప్రాజెక్ట్ అధికారి జ్యోతి, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు పాల్గొన్నారు.