calender_icon.png 22 April, 2025 | 5:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడంచెల వ్యూహంతో యువతకు ఉపాధి

22-04-2025 01:54:36 AM

  • త్వరలో 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలిస్తాం
  • డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • 100కు పైగా కంపెనీలతో మధిరలో మెగా జాబ్‌మేళా 

ఖమ్మం, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పన కోసం  ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఐదువేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో మధిర పట్టణంలోలో సోమవారం ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి, మాట్లాడారు.

ఉద్యోగ మేళాలో 100కు పైగా కంపెనీలు పాల్గొన్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలుగా పాలకులు యువతను నిర్లక్ష్యం చేశారని, యువతకు ఉపాధి అవకాశాలు చూపించడంలో వైఫల్యం చెందారని అన్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం మూడంచెల వ్యూహం అమలు చేస్తున్నదన్నారు.

త్వరలోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కసరత్తు జరుగుతుందని వెల్లడించారు. బహుళ జాతుల సంస్థలకు రాష్ట్రంలో అవసరమైన వనరులు కల్పించి భారీ ఎత్తున పెట్టుబడులు, వీటి ద్వారా యువతకు లక్షల్లో ఉద్యోగ అవకాశాలు సాధిస్తున్నామని అన్నారు.

ఉపాధిని ప్రోత్సహించేందుకు రూ.9 వేల కోట్ల పెట్టుబడితో రాజీవ్ యువ వికాసం పథకం కింద యువతకు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2 న స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు మంజూరు పత్రాలు పంపిణీ చేయనున్నామని తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్‌గా అప్‌గ్రేడ్ చేశామని భట్టి విక్రమార్కట వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, సింగరేణి జనరల్ మేనేజర్ సాలీం రాజు పాల్గొన్నారు.