calender_icon.png 31 January, 2025 | 8:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో 5,200 మందికి ఉపాధి

09-12-2024 01:32:34 AM

  1. 7,592 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చిన సంస్థలు
  2. 4 కంపెనీలతో ఒప్పందం చేసుకున్న ఐటీ, పరిశ్రమల శాఖ
  3. ఉపాధి పెంచేందుకే ప్రత్యేక ఎంఎస్‌ఎంఈ పాలసీ అమలు
  4. మీసేవా ద్వారా అందుబాటులోకి మరిన్ని పౌరసేవలు
  5. టీఫైబర్‌తో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల అభివృద్ధి
  6. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

త్వరలో తెలంగాణలో మరో ౫ వేలకుపైగా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. రూ.౭,౫౯౨ కోట్ల భారీ పెట్టుబడులతో రాష్ట్రం లో కంపెనీల స్థాపనకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఈ మేరకు ఆదివారం నాలుగు కంపెనీలు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాయి.

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతోనే ఎక్కువ ఉపాధి లభిస్తుందని, అందులో భాగంగా తెలంగాణలో ప్రత్యేకంగా ఎంఎస్‌ఎంఈ పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చామని శ్రీధర్‌బాబు చెప్పారు. మీసేవా కేంద్రా ల ద్వారా ప్రజలు అందుకుంటున్న సేవలను మరింత సులభతరం, వేగవంతం చేసేందుకు కొత్త మీసేవా మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు.

ఈ యాప్‌లో గవర్నమెంట్ టూ సిటిజెన్ (జీటూసీ), బిజినెస్ టూ సిటిజెన్ (బీటూసీ), వాల్యూ యాడెడ్ సర్వీసెస్ వంటి 230 అత్యవసర సేవలు వినియోగదారులకు ఆన్‌లైన్‌లోనే లభిస్తాయని మంత్రి వెల్లడించారు.

హైదరాబాద్, డిసెంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలోని పారిశ్రామిక అనుకూల వాతావరణం ప్రపంచ స్థాయి కంపెనీలను ఆకర్శిస్తున్నది. ఇప్పటికే అనేక కంపెనీలు రాష్ట్రంలో, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సులభతరమైన, వేగవంతమైన అనుమతుల ప్రక్రియ కారణంగా పలు కంపెనీలు తెలంగాణబాట పట్టాయి. రాష్ట్రంలో త్వరలో 5 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. శనివారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు సమక్షంలో నాలుగు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి.

మూడు రంగాలకు చెందిన ఈ నాలుగు కంపెనీలు త్వరలోనే రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టునున్నాయి. ఏరోస్పేస్ రంగానికి చెందిన ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ పవర్ అలాయ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంటు 25 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నది. ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజ్ రంగానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ సోలార్ ఇన్గోట్స్, అల్యూమినియం ప్లాంట్‌ను 125 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుంది.

అదే రంగానికి చెందిన ఎం/ఎస్ ప్రీమియం ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ కంపెనీ 4 జీడబ్ల్యూ సోలార్ పీవీ టాప్‌కాన్ మాడ్యుల్ మ్యానుఫాక్చరింగ్ ప్లాంటును 75 ఎకరాల్లో నిర్మించనున్నది. దీంతోపాటు లెన్స్‌కార్ట్ కంపెనీ కళ్ల అద్దాల పరికరాల తయారీకి సంబంధించిన ప్లాంటును హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నది. 

రూ.7,592 కోట్ల పెట్టుబడి 

ఇప్పటికే వేల కోట్ల పెట్టుబడులు, వేలాది మందికి ఉపాధి అవకాశాల కల్పన అందిస్తూ దూసుకుపోతున్న తెలంగాణకు మరోసారి భారీస్థాయి పెట్టుబడులు వస్తున్నాయి. నాలుగు ప్రపంచస్థాయి కంపెనీలు వేల కోట్ల పెట్టుబడులతో ముందుకు వచ్చాయి. ఆజాద్ ఇంజినీరింగ్ కంపెనీ రెండు దశల్లో రూ.800 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే ప్లాంటుతో 600 మందికి ఉపాధి లభించనున్నది.

ప్రీమియర్ ఎనర్జీస్ కంపెనీ రూ.1,950 కోట్లతో ప్రారంభించే ప్లాంటుతో 1,500 మందికి ఉపాధి లభిస్తుంది. ఎం/ఎస్ ప్రీమియం ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ ప్రై.లిమిటెడ్ సంస్థ రూ.3,342 కోట్లతో ఏర్పాటు చేసే తయారీ ప్లాంటుతో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. లెన్సకార్టు కంపెనీ రూ.1,500 కోట్లతో ప్రారంభించే తయారీ ప్లాంటుతో 2,100 మందికి ఉపాధి అందుతుంది. అన్నీ కలిపి మొత్తంగా రూ.7,592 కోట్ల పెట్టుబడితో 5,200 మందికి ఉపాధి లభించనున్నది.