నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 7 (విజయక్రాంతి): ఉద్యోగులు సమయ పాలన పాటించాలని, ఉదయం 10.30 గంటల తర్వాత విధులకు హాజరైన వారిపై చర్యలు తీసుకుంటామని, అవసరమైతే మెమోలు జారీ చేస్తామని జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిహెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలోని పలు సెక్షన్లలో మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు.
ఉదయం 11.30 గంటలు అయినా కొందరు ఉద్యోగులు విధులకు రాకపోవడాన్ని గమనించారు. తనిఖీలు చేస్తున్న సమయంలోనూ ఉద్యోగులు విధులకు రావడాన్ని గమనించి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజూ ఉదయం 10.30 తర్వాత అటెండెన్స్ రిజిస్ట్రార్లు తన కార్యాలయానికి తీసుకు రావాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన సర్క్యులర్‌ను వెంటనే జారీ చేయాలని అడ్మిన్ అడిషనల్ కమిషనర్ నళిని పద్మావతికి సూచించారు. మేయర్ వెంట ఎన్నికల విభాగం అడిషనల్ కమిషనర్ అలివేలు మంగతాయారు, సీపీఆర్వో మహమ్మద్ ముర్తుజా తదితరులు ఉన్నారు.