calender_icon.png 6 October, 2024 | 1:36 AM

అడవుల సంరక్షణకు ఉద్యోగులు ప్రాణాలర్పించారు

11-09-2024 01:02:05 AM

  1. అటవీ భూములు అన్యాక్రాంతం కానివ్వం 
  2. అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ 

హైదరాబాద్,సెప్టెంబర్ 9 (విజయక్రాంతి) : దేశ రక్షణకు సరిహద్దుల్లో శత్రు మూకలతో పోరాడుతూ సైనికులు ప్రాణాలు అర్పిస్తుంటే.. దేశ సహజ వనరులైన అడవుల సంరక్షణ కోసం పోరాటం చేస్తూ అటవీ శాఖ ఉద్యోగులు ప్రాణాలు అర్పిస్తున్నారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా అడవుల కోసం ప్రాణాలర్పించిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. అటవీ సంపద సంరక్షణకు, వణ్యప్రాణులల పరిరక్షణకు అటవీ శాఖ ఉద్యోగులు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయమని చెప్పారు.

మనిషి జీవితం అడవుల నుంచి అరంభమైందని, మానవ పరిణామక్రమానికి అడవులు సాక్షిభూతంగా నిలిచాయని పేర్కొన్నారు. మానవ మనుగడకు అడవుల ప్రాధాన్యతను గుర్తించిన వ్యవస్థలను అడవులను ప్రభుత్వ పరంగా కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించడంతోనే అటవీశాఖకు బీజం పడిందని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా 22 మంది అటవీశాఖ సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. అడవుల సంరక్షణ కోసం వారు చేసిన త్యాగాలు వెలకట్టలేవన్నారు. అటవీ సంపదను 24 శాతం నుంచి 33 శాతానికి పెంచే మహా యజ్ఞంలో వారు భాగస్వామ్యం అయ్యారని తెలిపారు.