08-02-2025 12:24:08 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) విధానానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా దశాబ్ధకాలంగా పోరాటం జరుగు తుంటే కొత్తగా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) పేరుతో ఉద్యోగులను మభ్యపెట్టేందుకు కేంద్రం చూస్తోందని ఎన్‌ఎం ఓపీఎస్ జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ మండిపడ్డారు.
బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో ఎన్‌ఎంఓపీఎస్ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్య సర్కారీ ఎన్‌పీఎస్ నౌకరా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాంతారామ తేజ అధ్యక్షతన ఉపవాస సత్యాగ్రహ ధర్నాను శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా ఎన్‌ఎంఓపీఎస్ జాతీయ సెక్రెటరీ జనరల్ స్థితప్రజ్ఞ హాజరై మాట్లాడారు. ఏప్రిల్ 1 నుంచి యూపీఎస్ కొత్త పథకాన్ని అమలు చేసేందుకు కేంద్రం సిద్ధమవుతోందని తెలిపారు. ఈ స్కీమ్ ఉద్యోగుల జీవితాలను మరింత దుర్భరం చేస్తోందని, కార్పొరేట్ శక్తులకు ఉద్యోగుల జీవితాలను తాకట్టు పెడుతోందని మండిపడ్డారు.
ప్రభుత్వానికి, ఉద్యోగులకు ఏ విధంగానూ భద్రత కల్పించదని, ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకొని పాత పెన్షన్ (ఓపీఎస్) విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలకు ఓపీఎస్ ఇవ్వకుండా అడ్డుపడుతున్న కేంద్ర ఆర్థిక శాఖ, ఈరోజు సీపీఎస్ నుంచి యూపీఎస్‌లోకి వెళ్లే పాలసీని తయారుచేయడం విడ్డూరమన్నారు.
ఇది రాష్ర్ట ప్రభుత్వాల హక్కులను కాలరాయడంతోపాటు సమా ఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. దేశంలోని జార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్‌లో ఎలాఅయితే కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించారో అదే విధంగా కర్ణాటకలోనూ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ యూపీఎస్‌పై తెలంగాణలో మార్చి 2న ధర్నాచౌక్‌లో యుద్ధభేరి మోగించబోతున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కర్ణాటక సీబీఎస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగన్న, మహాదేశ్ వర్మ, మాజీ ఎంపీ మంజునాథ తదితరులు పాల్గొన్నారు.