calender_icon.png 25 October, 2024 | 5:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత జిల్లాల వారీగానే ఉద్యోగుల సర్వీస్!

23-07-2024 01:27:53 AM

317 జీవోను పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం

త్వరలో మరోసారి భేటీ

హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి): ఉద్యోగ, ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పాత జిల్లాల పరిధిగా పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. 317 జీవోపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ సచివాలయంలో సోమవారం సమావేశమైంది. ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులైన మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.  ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

తొమ్మిది ప్రభుత్వ శాఖలపై ప్రధానంగా కమిటీ చర్చించింది. పాత జిల్లాల వారీగా ఉద్యోగుల సర్వీస్, పదోన్నతుల అంశాలను పరిగణలోకి తీసుకొని 317 జీవోను పరిష్కరించాలని క్యాబినెట్ సబ్ కమిటీ ఈమేరకు నిర్ణయించింది. అయితే వివిధ శాఖల అధికారులు వారి శాఖల పరంగా పూర్తి సమాచారం ఇవ్వనందున యుద్ధ ప్రాతిపదికన పూర్తి సమాచారం ఇవ్వాలని అధికారులను కమిటీ ఆదేశించింది. సమావేశంలో  ఉన్నతాధికారులు నవీన్ మిట్టల్, మహేష్ కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవి గుప్తా, పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు, అడిషనల్ డీజీ షికా గోయల్, ప్రాథమిక విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.