calender_icon.png 20 November, 2024 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెలవు లేకుండా పనిచేసి ఉద్యోగి మృతి!

10-09-2024 02:33:27 AM

104 రోజులు నిర్విరామంగా పని

బీజింగ్, సెప్టెంబర్ 9: ఒకే ఒక్కరోజు సెలవు తీసుకుని ఓ పెయింటర్ ఏకంగా 104 రోజులు పనిచేశాడు. చివరకు ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు శరీరంలోఒక్కో అవయవం దెబ్బతిని మృత్యువాత పడ్డాడు. ఈ ఘటన గతేడాది చైనాలో చోటుచేసుకోగా తాజాగా మృతుడి కుటుంబ సభ్యులు కోర్టును ఆశ్రయించడంతో వెలుగు చూసింది. 30 ఏళ్ల అబావో అనే వ్యక్తి వృత్తిరీత్యా పెయింటర్. అతడు గతేడాది ఫిబ్రవ రిలో జీయాంగ్ ప్రావిన్స్ పరిధిలో  జోసాన్ అనే కంపెనీతో పెయింటింగ్ ప్రాజెక్ట్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఫిబ్రవరి నుంచి ఏకధాటిగా పనిచేయడం ప్రారంభించాడు. ఏప్రిల్ 6న ఒక్కరోజు సెలవు తీసు కుని తిరిగి మే 25 వరకు పనిచేశాడు. ఈ క్రమంలో అబావో ఆరోగ్యం క్షీణించింది. దీంతో నెల 28న ఆసుపత్రి పాలయ్యాడు. అక్కడ చికిత్స పొందుతూ జూన్ 1న మృతిచెందాడు.

కంపెనీ అబావోను ఒత్తిడికి గురిచేయడం, పనిభారం పెంచడంతోనే మృతి చెందాడని అతడి కుటుంబ సభ్యులు కోర్టు ను ఆశ్రయించారు. కానీ సదరు కంపెనీ మాత్రం అబావోపై ఎలాంటి ఒత్తిడి లేదని, అతడితో సహేతుకంగానే పనిచేయించామని సమర్థించుకున్నది. కానీ, ఆ వాదనను జౌషాన్ ఇంటర్మీడియట్ పీపుల్స్ కోర్టు మాత్రం అబావో మృతికి కంపెనీ 20శాతం కారణమని అంగీకరించలేదు. అందుకు కంపెనీ బాధ్యత వహించాలని ఆదేశించింది. మృతుడికి కుటుంబానికి 4 లక్షల యువాన్ల పరిహారం చెల్లించాలని, వారు అనుభవించిన మానసిక క్షోభకు మరో 10 వేల యువాన్లు చెల్లించాలని ఆదేశించింది. కంపెనీ తిరిగి పై కోర్టుకు వెళ్లినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. పై కోర్టు కూడా కింది కోర్టు తీర్పునే సమర్థిస్తూ.. ఆ కంపెనీ పిటిషన్‌ను కొట్టివేసింది.