బాలీవుడ్ నటి కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ చిత్రానికి ఆమె నిర్మాతగానూ వ్యవహరిస్తూ ఇందిరా గాంధీ పాత్రలో నటించింది. దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించగా, జయప్రకాశ్ నారాయణ్ పాత్రలో అనుమమ్ ఖేర్ కనిపించనున్నారు. శ్రేయస్ తల్పడే ఈ చిత్రంలో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి పాత్రలో నటించారు. మొదట ఈ చిత్రాన్ని గత ఏడాది నవంబర్ 24న విడుదల చేయాలని భావించినప్పటికీ వీలుపడలేదు. తర్వాత జూన్ 14కు రిలీజ్ అనుకొని అప్పుడూ వాయిదా వేశారు. ఇప్పుడు సినిమాకు సం బంధించి అన్ని పనులూ పూర్తి కావటంతో తాజాగా కొత్త విడుదల తేదీని కంగనా ఎట్టకేలకు మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది.
‘దేశంలో అత్యయిక స్థితి ఏర్ప డి మంగళవారం నాటికి 49 ఏళ్లు పూర్తయి 50వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అందుకే ఈ చీకటి రోజులకు సంబంధించిన ఈ సినిమా విడుదల తేదీని నేడు ప్రకటిస్తున్నా’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్‌లో పేర్కొన్నది కంగనా. సెప్టెంబర్ 6న ‘ఎమర్జెన్సీ’ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు వెల్లడించిందామె. ‘మణికర్ణిక’ తర్వాత కంగనా దర్శకత్వం వహించిన రెండో చిత్రమిది. 1975లో దేశంలో ఎమర్జె న్సీ విధించడానికి గల కారణాలేం టి? ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలేంటి? అనే విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్న నేపథ్యంలో, దీనిపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది.