పట్టభద్రుల ఎన్నికల్ల బీఆర్‌ఎస్‌ను గెలిపించండి
కాంగ్రెస్ అభ్యర్థి ఓ బ్లాక్‌మెయిలర్
అలాంటివాళ్లను గెలిపిస్తే అరాచకమే
సీఎం మాటలకు యువత మోసపోవద్దు
నోటిఫికేషనే వెయ్యకుండా ఉద్యోగాలెలా ఇచ్చారు?
రెండు లక్షల ఉద్యోగాలిచ్చేదాకా వదలం
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు
హైదరాబాద్, మే 15 (విజయక్రాంతి): త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు అధికార స్వరాలను కాకుండా, ధిక్కార స్వరాలను ఎన్నుకోవాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పిలుపునిచ్చారు. బుధవార తెలంగాణభవన్‌లో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించినంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశ్నించే నాయకుడు రాకేష్‌రెడ్డి శాసనమండలికి ఎన్నిక కావాలని అన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో గత నాలుగు పర్యాయాలు తమకు అవకాశమిచ్చారని, గెలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారని, ఉద్యోగాలు, వసతుల విషయంలో తమ పార్టీ ఎమ్మెల్సీలు నిబద్ధతతో పనిచేశారని చెప్పారు.
అబద్ధాల సర్కారుకు మద్దతివ్వద్దు
యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. బీఆర్‌ఎస్ పాలనలో విద్యావ్యాప్తికి, మౌలిక వసతుల కల్పనకు ఎంతో కృషి చేశామని.. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు దేశంలోనే అత్యధికంగా వేతనాలు ఇచ్చామని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన 30 వేల ఉద్యోగాలను తామే ఇచ్చామని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని విమర్శించారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఒక్క పరీక్ష కూడా నిర్వహించకుండా ఉద్యోగాలు ఇచ్చినట్లు బొంకుతున్నారని మండిపడ్డారు. గెలిచిన ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారని, అందుకోసం ప్రభుత్వానికి ఇంకా ఆరేడు నెలల సమయమే ఉందని గుర్తుచేశారు.
ఆ ఉద్యోగాలు భర్తీ కావాలంటే ప్రశ్నించే గొంతు సభలో ఉండాలని, ప్రజలకు న్యాయం జరగాలంటే ప్రశ్నించే రాకేష్‌రెడ్డి శాసన మండలిలోకి పంపించాలని కోరారు. కాంగ్రెస్ నుంచి పోటీచేసే అభ్యర్థి మీడియాను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తారని, అతడిని ఆదరిస్తే ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైతుందని హెచ్చరించారు. ఆయన ఎప్పడు ఏ పార్టీలో ఉంటాడో తెలియదని, ఎవరు ఏ సమయంలో విమర్శిస్తారో ప్రజలు గుర్తు చేసుకోవాలని సూచించారు. గతంలో నల్లగొండ నయీమ్‌ను చూశామని, ఇటువంటి వ్యక్తులు చట్టసభల్లోకి అడుగుపెడితే దోపిడీకి తెగబడతారని అన్నారు.
అకాల వర్షాలకు చాలా చోట్ల కల్లాల్లో ధాన్యం పూర్తిగా తడిచిందని, ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కూడా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు పేరుతో రైతులను ఇబ్బందలు పెట్టే ప్రయత్నం చేయవద్దని, క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇచ్చేవరకు రేవంత్ సర్కార్‌ను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు. బీఆర్‌ఎస్ హయాంలో టెట్ పరీక్ష ఫీజు రూ.200 ఉంటే, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 వేలు చేసిందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కల్లబొల్లి మాటలు నమ్మి నిరుద్యోగులు ఓటు వేయవద్దని, యువత కోసం పనిచేసే నాయకులను చట్టసభలకు పంపాలని కోరారు.