పీసీసీ అధ్యక్షునికి ఫిర్యాదు చేసిన ఎల్లారెడ్డి నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో తన వ్యక్తిగత సిబ్బందితో నాయకులను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ జెడ్పిటిసి నారెడ్డి మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పదవులు ఇస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వం మీద ధర్నాలు రాస్తారోకోలు చేస్తుంటే కనీసం ఖండించడం లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి కూడా చేయలేని పరిస్థితిలో ఉంటూ అదే విధంగా క్యాంప్ కార్యాలయంలో కనీసం జాతీయ జెండాను కూడా ఎగుర వేయకుండా అవమాన పరుస్తున్నారని అన్నారు.
నియంత పాలన నిర్వహిస్తున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే స్థానికంగా ఉండకుండా విదేశాలకు వెళ్తూ సీఎంఆర్ఎఫ్ చెక్కులను నాయకులతో కాకుండా వ్యక్తిగత సిబ్బందితో పంచుతూ సీనియర్ నాయకులను అవమానపరుస్తున్నారని ఫిర్యాదు చేశారు. గత 20 ఏళ్లుగా పార్టీకి పనిచేస్తున్న వారిని కనీసం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎదురు మాట్లాడితే గుండాగిరి చేస్తూ దూషిస్తూ కొడుతున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఉంటే పోకడలతో ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రవర్తిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గిరెడ్డి మహేందర్ రెడ్డి, నా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నల్లమడుగు షరీఫ్, కాట్ మండి సంతోష్ పటేల్ తో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.