calender_icon.png 21 December, 2024 | 5:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నితిన్‌తోనే ఎల్లమ్మ!

16-10-2024 12:08:02 AM

ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంది. దానిని గుర్తించి ఆచరణలో పెడితే విజయం పరుగులు పెడుతూ వస్తుంది. ఒక కమెడియన్‌గా ప్రేక్షకులకు పరిచయమైన వేణులో ఒక అద్భుతమైన దర్శకుడున్నాడని ‘బలగం’ చిత్రం వచ్చే వరకూ తెలియదు. ఆ సినిమా అద్భుత విజయం సాధించడమే కాదు.. ఎన్నో అవార్డులను గెలుచుకుంది. ఆ తరువాతే వేణుకి అసలైన సవాల్ మొదలైంది.

వేణు తరువాత ఏదైనా సినిమా తీస్తున్నారంటే అంచనాలు భారీగా ఉంటాయి. ఆ అంచనాలను అందుకోగలిగే సినిమా తీస్తేనే డైరెక్టర్‌గా నిలదొక్కుకుంటారు. లేదంటే ఇబ్బందే. బలగం సినిమా తర్వాత వేణు ‘ఎల్లమ్మ’ కథను సిద్ధం చేసుకున్నారు. అయితే తన కథ చెప్పి హీరోను ఒప్పించేందుకే వేణుకి దాదాపు ఏడాదిన్నర సమయం పట్టింది.

అంతులేని కథ సినిమా మాదిరిగా కథలు చెప్పడం.. హీరో ఓకే అవడం.. ఆ తరువాత తప్పుకోవడం జరుగుతూ వచ్చింది. వేణు కథ విని చాలా బాగుందన్న హీరోల్లో నాని, వరుణ్ తేజ్, తేజ సజ్జ వంటి హీరోలున్నారు. చివరకు నితిన్ ఓకే చెప్పినట్టు సమాచారం. ఇక ‘ఎల్లమ్మ’ కథ వచ్చేసి తెలంగాణ ‘కాంతారా’ అని వేణు చెబుతున్నారు.

మరోసారి పూర్తి గ్రామీణ నేపథ్యంతో కూడిన కథను వేణు తెరకెక్కించనున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలంగాణలో ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తారు. అమ్మవారి కథేంటి? అమ్మవారిని కొలిచే విధానం వంటి అంశాలన్నింటినీ కథాంశంగా తీసుకుని వేణు ‘ఎల్లమ్మ’ను తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది.