calender_icon.png 19 April, 2025 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్కతుర్తి జంక్షన్ పనులను పూర్తి చేయాలి

17-04-2025 12:00:00 AM

హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

హనుమకొండ ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): బుధవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో కుడా ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఎల్కతుర్తి జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనులు, ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణాన్ని అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ పనుల పురోగతి గురించి కుడా పీవో అజిత్ రెడ్డి, ఈఈ భీమ్ రావు, ఇతర అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జంక్షన్ నిర్మాణానికి సంబంధించిన మ్యాపును కలెక్టర్ పరిశీలించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ జంక్షన్ నిర్మాణం, సుందరీకరణ పనులు దాదాపు 80% వరకు పూర్తయ్యాయని మిగతా పనులను పది రోజుల్లో  పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

ఫౌంటెన్ నిర్మాణం, గ్రీనరీ ఏర్పాటు, శిల్పాలు, విద్యుత్ లైట్లు, హై మాస్ట్ లైట్లు, సైన్ బోర్డులు, జిబ్రా క్రాసింగ్ ఏర్పాటు, ఇతర అభివృద్ధి పనులు పూర్తి చేయాలన్నారు. బస్టాండ్ ప్రాంగణం, ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను  కలెక్టర్ పరిశీలించారు. క్యాంటీన్ ఏర్పాటు బాగుందని,  విజయవంతంగా క్యాంటీన్ నిర్వహించాలన్నారు.

ఈ సందర్భంగా జంక్షన్ నిర్మాణం, సుందరీకరణ పనుల గురించి అధికారులకు కలెక్టర్ పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్,  ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్, ఎంపీడీవో విజయ్ కుమార్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.