28-02-2025 12:00:00 AM
భారతీయ చట్టం ‘గ్రాట్యుటీ చెల్లింపు..1972’ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలలో పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు లేదా కనీసం అయిదు సంవత్సరాలు సేవ చేసిన తర్వాత రాజీనామా చేసిన ఉద్యోగులకు ఒకేసారి గ్రాట్యుటీని చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం గతంలో గ్రాట్యుటీ సీలింగ్‌ను రూ.03.50 లక్షలనుంచి రూ.10 లక్షలకు 2010 మే 24 నుంచి వర్తింపచేసింది. సింగరేణి యాజమాన్యం -2007 జనవరి 1 నుంచి అంటే మూడు సంవత్సరాల నాలుగు నెలల ఇరవై రోజుల వెనుక నుండి రూ.10 లక్షల సీలింగ్‌ను అమలు పరిచింది.
కానీ, ప్రస్తుతం వెనుక తేదీనుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన తేదీ (29.-3-.2018) నుండి మాత్రమే 20 లక్షల రూపాయల గ్రాట్యుటి ఉద్యోగులకు వర్తింపజేస్తున్నారు. అధికారులకు మాత్రం 2017 జనవరి 1 నుంచి అంటే సుమారు 15 నెలలు వెనుక నుంచి వర్తింపజేస్తున్నారు. ఇదేం న్యాయం? ‘గ్రాట్యుటీ చట్టం ఉద్యోగులు అనే ఉంది. అధికారులు, కార్మికులు అన్న తేడా లేదు. చట్ట ప్రకారం కార్మికులు, అధికారుల మధ్య తారతమ్యం ఉండదు.
2017 జనవరి నుంచి 2018 మార్చి వరకు సింగరేణిలో దాదాపు 4,000 మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందారు. వీరికి కేవలం రూ.10 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ అమలు పరిచారు. వీరంతా లేబర్ కమిషనర్ కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తున్నది. వయోధిక భారంతో వ్యయ ప్రయాసలకు లోనవుతున్నారు.
లాభాలు వచ్చే సంస్థ తమ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపు యాజమాన్యం తన ఇష్టమైన తేదీనుంచి ఇచ్చుకోవచ్చనీ చట్టం వెసులుబాటునూ కల్పించింది. సింగరేణిలో గెలిచిన గుర్తింపు సంఘం పోరాటాలు చేసి ఉద్యోగులకు ఎన్నో హక్కులు, సౌకర్యాలు కల్పించింది. కనుక, యాజమాన్యంతో చర్చించి రిటైర్డ్ ఉద్యోగులకూ తేడా లేకుండా రూ.20 లక్షల గ్రాట్యుటీ అందేలా చూడాలి.
-ఆళవందార్ వేణుమాధవ్, హైదరాబాద్
కార్మికుల గల్లంతు దురదృష్టకరం
ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గంలో ఎనిమిది మంది కార్మికులు గల్లంతవడం అత్యంత దురదృష్టకర సంఘటన. దీనిని రాజకీయం చేయడం తగదు. మానవీయ కోణంలో వారిని ప్రాణాలతో వెలికి తెచ్చే ఉపాయాలు ఆలోచించాలి. ర్యాట్‌హోల్స్ రెస్క్యూ బృందం కృషి ఫలించాలని ఆశిద్దాం.
బి.విభవ్, కొండాపూర్