19-04-2025 12:00:00 AM
పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటీ పృథ్వీ, ఉపాధ్యక్షులు బి.నరసింహారావు
హనుమకొండ, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో అన్ని అర్హతలు ఉండి దశాబ్దకాలంపైగా బోధన కొనసాగిస్తున్న కాంట్రాక్ట, పార్ట్ టైం అధ్యాపకులను తక్షణమే రెగ్యులరైజ్ చేయాలని పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృద్వి, ఉపాధ్యక్షులు బి.నరసింహారావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శుక్రవారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్ హౌస్ లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థుల ఐక్యత (పి.డి.ఎస్.యు) కె.యు. అధ్యక్షులు బి.బాలక్రిష్ణ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కాంపాటి పృద్వి, బి.నరసింహారావు లు మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ యూనివర్సిటీలో బోధిస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలకు భరోసాతో కూడిన భద్రత కల్పిస్తామని, హామీనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీ.వో.నెంబర్ 21 తీసుకువచ్చి యూనివర్సిటీల్లో బోధిస్తున్న కాంట్రాక్ట్ ,పార్ట్ టైం అధ్యాపకుల జీవితాలను ప్రశ్నార్ధకంగా మార్చుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల వ్యవస్థనే లేకుండా చేస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లయినా కాంట్రాక్టు వ్యవస్థను రూపుమాపకుండా వారితో ఎట్టి చాకిరి చేయించుకున్నాడని, అదే తరహాలో నేడు రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి కాంట్రాక్టు, పార్ట్ టైం అధ్యాపకులుగా కొనసాగుతున్న వారిని, వారి కుటుంబాలను శాశ్వతంగా అంధకారంలోకి నెట్టి వేసే కుట్రలకు పాల్పడుతున్నాడని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి కాంట్రాక్ట్, పార్ట్ టైం అద్యపకులకు తగిన న్యాయం చేయాలని కోరారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులన్నింటిని రెగ్యులర్ ప్రతిపాదికన భర్తీ చేయాలని,తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తున్న కాంట్రాక్ట్, పార్ట్ టైం అధ్యాపకుల పై రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న నిర్లక్ష్య పూరిత నిరంకుశ వైఖరిని వెంటనే విడనాడాలని డిమాండ్ చేశారు.
లేకపోతే అన్ని విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. కాకతీయ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి వి.కావ్య, ఉపాధ్యక్షులు పి.అనూష, గణేష్, సహాయ కార్యదర్శులు యాదగిరి, సాధన, నాయకులు లోకేష్, శ్రీజ, వంశి తదితరులు పాల్గొన్నారు.